
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
మక్తల్: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండి రోగులకు సేవలు అందించాలని కలెక్టర్ సిక్తానపట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టర్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి గది, స్కానింగ్ సెంటర్, ల్యాబ్, డయాలసిస్ సెంటర్, జనరల్ వార్డు, డ్రగ్స్‌స్టోర్‌ను పరిశీలించారు. ఆస్పత్రిల్లో జరిగిన కాన్పుల గురించి ఆరా తీశారు. ల్యాబ్‌లో రక్త, టీబీ నిర్ధారణ పరీక్షలు, వాటి నమూనాలను ఎక్కడ భద్రపరుస్తున్నారని ప్రశ్నించారు. పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. డయాలసిస్ సెంటర్‌లో అందుబాటులో బెడ్ల పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో మరుగుదొడ్లు మరమ్మతు పనులు చేయించాలని కమిషనర్ శంకర్‌నాయక్‌కు ఆదేశించారు. ప్రతిరోజు 200 నుంచి 300 ఓపీలు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. రా త్రి సమయంలో అత్యవసరంగా రోగులు వస్తే వారి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డెంగీ కేసులు నమోదుపై ఆరా తీశారు.
పంద్రాగస్టు వేడుకలకు మంత్రి రాక
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 15న నిర్వహించే 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.