
ఉద్యానానికి ఊతం
నర్వ: ఉద్యాన పంటల సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. మిషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నేషనల్ మిషన్ అన్ ఎడిబుల్ ఆయిల్స్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆయిల్‌పాం వంటి పథకాలను అమలు చేస్తూ రైతులకు రాయితీలను అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి ఏడాది పండ్ల తోటల సాగు తగ్గుతుండడంతో రాయితీని పెంచి సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 16,600 ఎకరా ల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇందులో 3,500 ఎకరాల్లో కూరగాయలు, ఆయిల్ పాం 6,500 ఎకరాల్లో సాగవుతుండగా ప్ర భుత్వ రాయి తీతో పాటు గిట్టుబాటు ధర కల్పింస్తుడడంతో పండ్ల తోటలను తొలగించి ఆయిల్‌పాం సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా రాయితీలను ప్రకటించింది.
డ్రాగన్‌ఫ్రూట్‌కు అధిక రాయితీ
ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మిషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) పథకం ద్వారా పండ్ల తోటలకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గతేడాది డ్రాగన్‌ఫ్రూట్‌కు హెక్టార్‌కు రూ.1,60,000 రాయితీ ఇవ్వగా.. ఈ ఏడాది రూ.3 లక్షలకు పెంచింది. బొప్పాయి సాగుకు గతేడాది ఇచ్చిన రూ.30 వేల రాయితీని కొనసాగిస్తోంది. మిర్చి, కూరగాయల సాగులో వాడుకునే మల్చింగ్‌కు ఈ ఏడాది రూ.20 వేలకు పెంచింది. మూడేళ్ల పాటు ఇదే రాయితీలను కొనసాగించనుంది. రైతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
సాగుపై అవగాహన
ప్రభుత్వం ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. రైతులను ప్రోత్సహించేందుకు గతంలో కంటే సబ్సిడీని పెంచింది. పండ్ల తోటలు సాగు పెంచడానికి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఉద్యాన పంటల సాగు పద్ధతులు, లాభాలు గురించి వారికి వివరిస్తున్నాం. – వెంకటరమణ,
క్లస్టర్ హార్టికల్చర్ అధికారి, మక్తల్
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రస్తుత మార్కెట్‌లో ఉ ద్యాన పంటలకు డిమాండ్ బాగా ఉంది. ప్రభుత్వం ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తూ రాయితీలను పెంచింది. జిల్లాలో భూములు ఉద్యాన పంటల సాగుకు అనువైనవి. సంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగు లాభాదాయకం. ఆసక్తి కలిగిన రైతులు హార్టికల్చర్ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి.
– సాయిబాబా,
జిల్లా ఉద్యాన, పట్టపరిశ్రమ శాఖ అధికారి
రాయితీని పెంచిన ప్రభుత్వం
ఎంఐడీహెచ్ పథకం ద్వారా అమలు
మూడేళ్ల పాటు సబ్సిడీ వర్తింపు
జిల్లాలో 16,600 ఎకరాల్లో సాగు

ఉద్యానానికి ఊతం

ఉద్యానానికి ఊతం