
కానరాని పురోగతి!
గద్వాల: పదేళ్ల క్రితమే పూర్తికావాల్సిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులను వచ్చే ఏడాది నాటికి పూర్తిచేసి.. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెబుతున్న అమాత్యుల హామీలు కేవలం సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనుల సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది.
నెరవేరని లక్ష్యం
బీడు భూముల్లో సాగునీటిని పారించి వలసల పాలమూరు రూపురేఖలు మార్చాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాజెక్టుల ద్వారా 1 0లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సంకల్పించారు. అయితే వైఎస్సార్ అకాల మరణాంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల పనులను పూర్తిచేయకుండా వదిలేయడంతో పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా 10 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగునీరు పారుతోంది.
కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించినా..
గతేడాది సెప్టెంబర్‌లో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు జడ్చర్ల వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల నుంచి పెద్దఎత్తున నిరసన సెగలు తగిలాయి. పెండింగ్ పనులు పూర్తి చేయాలంటే భూసేకరణ సమస్యను పరిష్కరించాలని గ్రహించిన మంత్రులు.. భూసేకరణ ప్రక్రియతో పాటు పెండింగ్ పనులను ఎప్పటికప్పు డు పర్యవేక్షించి వేగం పెంచాలని కలెక్టర్లకే బాధ్యత లు కట్టబెట్టారు. అయితే 10 నెలల కాలంలో ప్రాజెక్టుల పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు.
● 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో నిర్మాణం చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు అసంపూర్తిగానే ఉండగా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు కింద 2.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. వివిధ కారణలతో రెండుపంపులు మరమ్మతుకు గురై మూలకు చేరాయి.
● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు పదేళ్ల క్రితమే 90 శాతం పూర్తయ్యాయి. మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. గూడ్డెందొడ్డి, ర్యాలంపాడు జలాశయాల కింద 1.45 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మోటార్ల నిర్వహణ కొరవడటంతో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి నీటి పంపింగ్‌కు ఆటంకాలు ఏర్పడటం పరిపాటిగా మారింది.
● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడు జలాశయం గుండెకాయలాంటిది. అయితే రాక్‌టోల్, తూములు, ఆనకట్ట బండ్‌లో లీకేజీలు ఏర్పడటంతో నాలుగేళ్లుగా 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ వస్తున్నారు.గతేడాది పుణెకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం ర్యాలంపాడు రిజర్వాయర్‌ను సందర్శించి.. మరమ్మతుకు రూ.185 కోట్లు వ్యయం అవుతుందని నివేదించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు.
కొనసా..గుతున్న ‘పాలమూరు’
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సివిల్, మెకానికల్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అదే విధంగా పలు రిజర్వాయర్ల కింద భూ సేకరణకు సంబంధించి సమస్యలు పెండింగ్‌లో కొనసాగుతున్నాయి.
● మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. గత పాలకులు కోయిల్‌సాగర్ పనులను పూర్తిచేయకపోవడంతో నేటికీ పెండింగ్‌లోనే ఉంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్న క్రమంలో మోటారు పంపులలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కూడా నిర్వహణ లోపమే ప్రధాన కారణం.
● నారాయణపేట జిల్లాలో 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన భీమా ఎత్తిపోతల పథకం పనులు సైతం పెండింగ్‌లో కొనసాగుతున్నాయి. ఫలితంగా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొంది.
నాలుగేళ్లుగా మరమ్మతుకు
నోచుకోని ర్యాలంపాడు రిజర్వాయర్
నేడు సమీక్ష..
హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఉదయం సెషన్‌లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ప్రాజెక్టులు, మఽధ్యాహ్నం సెషన్‌లో మహబూబ్‌నగర్ పార్ల మెంట్ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్షిస్తారు.
సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై కాలయాపన
వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమే
ఊసేలేని ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు
మంత్రుల సమీక్షలు, క్షేత్రస్థాయిపర్యటనల్లో ప్రకటనలకే పరిమితం
నేడు రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష