
అత్యవసరమైతేనే బయటకు రావాలి
నారాయణపేట: రానున్న 72 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు. మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం, మూగ జీవాలు ప్రాణాలు కోల్పోకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉద్యోగులకు సెలవులు రద్దు
అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటూ, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ప్రజలకు అండగా ఉండాలన్నారు.
చెరువులు, కాలువల్లో చేపల వేటకు వెళ్లొద్దు
లోతట్టు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు, కాల్వలు, నదులల్లో చేపల వేట, ఈత కోసం ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోవడం వంటివి చోటుచేసుకున్న సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదేశించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఎక్కడైనా రోడ్లు తెగిపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు కొనసాగించాలన్నారు. పురాతన, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని పీహెచ్‌సీలు, ఆస్పత్రుల్లో సరిపడా మందులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు చోట్ల ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించామన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటామని తెలిపారు. జిల్లాలో మక్తల్ మంతన్‌గోడు వాగు, ఊట్కూరు మల్లేపల్లి నాగిరెడ్డిపల్లి, మరికల్ ఇబ్రహీంపట్నం వాగులు అలుగు పారుతున్నాయని ఆయా ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎస్. శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, జెడ్పీ సీఈవో శైలేష్, ఆర్డీఓ రామచంద్రనాయక్, అధికారులు పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్‌కుసమాచారం ఇవ్వండి
రెవెన్యూ, పోలీస్, వైద్యారోగ్య, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీ రాజ్, రోడ్లు, భవనాల శాఖలు, విపత్తు నిర్వహణ సంస్థలు రాబోయే మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించవచ్చని కలెక్టర్ సూచించారు. పరిస్థితులను బట్టి పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు సెలవులపై తగు నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లావ్యాప్తంగా జోరుగా వర్షాలు
కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ యోగేష్‌గౌతమ్