
‘నేను ఆడుకున్న మైదానం.. అభివృద్ధి చేస్తా’
మక్తల్: విద్యార్థిగా ఉన్నప్పుడు ఆడుకున్న మైదానం రుణం తీర్చుకుంటానని, మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల, యువజన, మత్స్యసహకార, పాడి పరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం స్థానిక మినీ స్టేడియం పరిసరాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలను రాష్ట్ర స్పోర్ట్స్ ఎండీ సోనీ బాలదేవి, డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. మినీ స్టేడియానికి రూ.20కోట్లు కేటాయించి అన్ని వసుతులు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు. స్టేడియంలో ఉన్న పాత భవనాలు కూల్చేందుకు కలెక్టర్ అనుమతి ఇవ్వాలని కోరారు. మైదానంలో వాకింగ్, ఖోఖో, వాలీబాల్, టెన్నిస్ కోర్టులను నిర్మిస్తామని తెలిపారు. రూ.3 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ షెడ్ నిర్మించామని తెలిపారు. జూనియర్, డిగ్రీ కళాశాలకు నూతన భవనాలు నిర్మిస్తామన్నారు. అనంతరం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో బంగారు, వెండి పతకాలను సాధించిన క్రీడాకారులను శాలువాతో సన్మానించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్‌గంగ్వార్, డీవైఎస్‌ఓ వెంకటేష్‌శెట్టి, లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, కోళ్ల వెంకటేష్, రవికుమార్, లక్ష్మణ్, కట్ట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూరు: మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 763లో రూ.1.50కోట్లతో స్పోర్ట్స్ స్టేడియం నిర్మించేందుకు మంత్రి వాకిటి రెండు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సర్వేను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవి, కోరం మహేష్‌రెడ్డి, యజ్ఞేశ్వర్‌రెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు.
నర్వ: మండల కేంద్రంలోని జొన్నగుట్ట వద్ద 5.28 ఎకరాల స్థలంలో చేపట్టబోయే మైదాన స్థలాన్ని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలదేవీతో కలిసి మంత్రి పరిశీలించారు. గ్రౌండ్ నిర్మాణం కోసం రూ.2కోట్లు మంజూరు చేస్తానని తెలిపారు. అనంతరం బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్ పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి