
ఎకరాకు రూ.60లక్షల నష్టపరిహారం ఇప్పించండి
నారాయణపేట: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ముంపుకు గురవుతున్న భూములకు తగిన నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆదివారం ఎంపీ డీకే అరుణను దేవరకద్రలో ఊట్కూర్‌కు చెందిన భూ నిర్వాసితులు కలిసి విన్నవించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద ౖపైడ్లెన్, కాలువలు, ఎఫ్‌టీఎల్ స్థాయిలో నీరు నిల్వ ఉంచే విధంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ పనుల కారణంగా తమ గ్రామ పరిధిలోని సుమారు 400 ఎకరాలను ప్రభుత్వ స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ భూములను కోల్పోతే తమ జీవనోపాధి కోల్పోతమంటూ ఎంపీ ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ గ్రామ పరిధిలో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ ఎకరాకు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు పలుకుతుందని అయితే, అధికారులు పాత రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు వాపోయారు.తమకు ఎకరాకు రూ.60లక్షల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. అలాగే తమ గ్రామ పరిధిలో పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి, ప్రభావిత ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఇందుకు ఎంపీ స్పందించి ఇరిగేషన్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్, బీఆర్‌ఎస్ నాయకులు వడ్ల మోనప్ప, భూ నిర్వాసితులు తరుణ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.