
పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ ప్రవేశాలు
కోస్గి రూరల్: కోస్గి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 11 స్పాట్ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమో కోర్సులలో సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కేటాయించిన కోర్సులో ప్రవేశాలు పొందవచ్చని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శనేశ్వరుడికి
తైలాభిషేకాలు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శనేశ్వరాలయాన్ని సందర్శించి తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం స్వామివారికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ గోపాల్‌రావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు.
వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: అమరరాజా కంపెనీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ నగర పరిధిలోని దివిటిపల్లి ఐటీ పార్క్‌లో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇక్కడ యువతకు మూడు నెలలపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ ఇస్తారన్నారు. కేవలం అమరరాజా కంపెనీ కోసమే కాకుండా అభ్యర్థులు ఎక్కడైనా ఉపాధి అవకాశాలు పొందేలా శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. మహబూబ్‌నగర్‌ను విద్య, వైద్య, రవాణా రంగాల్లో అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఇంజినీరింగ్, లా, ఐఐఐటీ కళాశాలలను మంజూరు చేశారన్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ సహకారంతో మహిళలకు స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. రానున్న పదేళ్లలో కనీసం 20 వేల మంది యువత నైపుణ్య శిక్షణ పొందేలా యత్నిస్తున్నామన్నారు. అనంతరం శిక్షణ పొందే అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, రాజన్న ఫౌండేషన్ డైరెక్టర్ జయకృష్ణ, ఓఎస్‌ఎస్‌ఐ సీఈఓ సలీంఅహ్మద్, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, అజ్మత్‌అలీ, అవేజ్, హన్మంతు, శివశంకర్, రాషెద్‌ఖాన్, ఖాజాపాషా, శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి
కందనూలు: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో జిల్లా అధ్యక్షుడు మురళి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కోరారు. 317 జీఓ బాధితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలన్నారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా క్రమం తప్పకుండా విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు సుదర్శన్ ఉన్నారు.

పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ ప్రవేశాలు