
ఔత్సాహికులకు వరం.. వాలీబాల్ అకాడమీ
మహబూబ్‌నగర్ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ జిల్లాకు వాలీబాల్ అకాడమీ మంజూరు చేసింది. అకాడమీ నడిచిన నాలుగేళ్లలో జిల్లా క్రీడాకారులు ఎంతో ప్రతిభ కనబరిచేవారు. అప్పట్లో ఈ వాలీబాల్ అకాడమీ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులుగా ఎదిగారు. అయితే నిధుల నిర్వహణ భారంతో 2008 సంవత్సరంలో వాలీబాల్ అకాడమీని మూసివేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల కృషి, అధికారుల చొరవతో మరోసారి వాలీబాల్ అకాడమీ ఏర్పాటై.. పూర్వవైభవం సంతరించుకునే దిశగా ముందుకు సాగుతోంది.
అధునాతన సౌకర్యాలతో..
మహబూబ్‌నగర్‌లోని మెయిన్ స్టేడియంలో నూతన వాలీబాల్ అకాడమీ రూ.19.70 లక్షల నిధులతో ఏర్పాటు చేశారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్ కోర్టులను ఆధునీకరించి వాటి స్థానంలో నూతన కోర్టులు నిర్మించారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్‌లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్ 12న వాలీబాల్‌లో అకాడమీలో ప్రవేశాల కోసం సెలక్షన్స్ నిర్వహించగా.. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి బాల, బాలికలు హాజరయ్యారు. అకాడమీలో 32 మంది బాలురు, బాలికలు ప్రవేశాలు పొందారు. స్విమ్మింగ్‌పూల్ అంతస్తులో బాలురకు, ఇండోర్ స్టేడియంలో బాలికలకు వసతి ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోజన వసతి కల్పించారు.
క్రీడాకారులకు మెరుగైన శిక్షణ
వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు పొందిన బాల, బాలికలకు మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక కోచ్ ఉండగా త్వరలో మరో కోచ్ రానున్నారు. కోచ్ పర్వేజ్‌పాషా క్రీడాకారులకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వేళలో రిక్రియేషన్ గేమ్, స్టెచ్చింగ్ ఫ్లెక్సిబిలిటీ, గ్రౌండ్ మూమెంట్, బాల్ డ్రిల్స్, సా యంత్రం బ్లాకింగ్, అటాకింగ్ డ్రిల్స్, బాల్ ప్రాక్టిస్‌పై శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతి శుక్రవారం ఐదు సెట్ల మ్యాచ్ ఆడిపిస్తున్నారు.
మహబూబ్‌నగర్‌లో నూతన వాలీబాల్ స్టేడియం ఏర్పాటు
శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాల క్రీడాకారులు
బాల, బాలికలకు మెరుగైన వసతి సౌకర్యాలు
ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణ
అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా ముందుకు..