
అయ్యో.. నేతన్నా
75 ఏళ్లయినా సభ్యత్వం ఇవ్వరు.. ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయరు!
●
● ఆందోళనలో గాంధీనగర్ చేనేత కార్మికులు
● సమస్యల పరిష్కారం
పట్టని పాలకులు
● చేనేత కార్మిక దినోత్సవంలో నల్లబ్యాడ్జీలతో నిరసన
రిజిస్ట్రేషన్ చేయండి..
ఎన్నికల సమయంలో నాయకులు రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. చేనేత కార్మికులకు సొసైటీలో సభ్యత్వం ఇవ్వాలి
– కెంచె నారాయణ,
చేనేత కార్మిక సంఘం నాయకుడు
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం..
గాంధీనగర్‌లోని చేనేత కార్మికుల గోడును అధికారులు, ప్రజాప్రతినిధులు, సొసైటీ పాలకవర్గం అర్థం చేసుకొని సమస్యలు పరిష్కరించాలి. సభ్యత్వ నమోదు, ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయించాలి. లేనిపక్షంలో సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తాం.
– కె.కాశీనాథ్, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ డివిజన్ నాయకుడు, నారాయణపేట
ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి..
1951లో ఏర్పడిన చేనేత సహకార సంఘంలో మా నాన్న నర్సప్ప సభ్యత్వం పొందారు. మాకు సొసైటీ ద్వారా ఇంటిని కట్టించారు. మేము ముగ్గురం అన్నదమ్ముళ్లం. 35ఏళ్లుగా తమకు సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నాం. ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాలని వేడుకుంటున్నాం. అయినా సోసైటీ పాలకవర్గం తమను లెక్కచేయడం లేదు.
– మ్యాకలి వెంకటేశ్
నారాయణపేట: జిల్లా కేంద్రంలో చేనేత సహకార సంఘం 1951లో ఏర్పడింది. అప్పట్లో దాదాపు 4,265 మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. చేనేత కార్మిక సొసైటీ తరఫున గాంధీనగర్ కాలనీ నిర్మించారు. మొత్తం 104 మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు చేనేత పనిముట్లు పంపిణీ చేశారు. ఇందుకు గాను కార్మికుల నుంచి ప్రతినెలా రూ. 5 చొప్పున దాదాపు రూ. 2,475 వసూలు చేశారు. సొసైటీ, ప్రభుత్వం నిర్ణయించిన ధరను 35ఏళ్ల క్రితమే లబ్ధిదారులు తమ వాటాధనం చెల్లింపులను పూర్తిచేశారు. అయినా నేటికీ సొసైటీ నిర్వాహకులు ఇంటి యజమానులకు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారంటూ చేనేత కార్మికులు ఆందోళన బాట పట్టారు.
ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా..
గాంధీనగర్‌లోని చేనేత సహకార సంఘం సభ్యులు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు, సొసైటీ సభ్యత్వాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఏ ఎన్నికలు వచ్చినా ఆయా పార్టీల నాయకులు చేనేత కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇవ్వడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ఎన్నికల్లో తమను ఓట్ల కోసం వాడుకుంటున్నారే తప్ప సొసైటీని ఒప్పించి తమకు ఇళ్ల రిజిస్ట్రేషన్, సభ్యత్వాలు ఇప్పించడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు వాపోయారు.
గాంధీజీ సాక్షిగా నల్లబ్యాడ్జీలతో నిరసన..
చేనేత కార్మిక సంఘం (టీయూసీఐ) ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద చేనేత కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్కడి నుంచి ప్రధాన రహదారుల గుండా ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన చేనేత కార్మికుల దినోత్సవ సమావేశానికి చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తమ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇక్కడ ఏం జరుగుతోంది..
చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా సంబురాలు జరుపుకోవాల్సిన చేనేత కార్మికులు.. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అవాక్కయ్యారు. ఇక్కడ ఏం జరుగుతుందంటూ అక్కడే ఉన్న ఆర్డీఓ రాంచందర్ నాయక్‌ను అడిగే ప్రయత్నం చేశారు. ఆ పక్కనే ఉన్న చేనేత, జౌళీశాఖ అధికారి కలెక్టర్‌కు సమస్యను వివరించారు. ఇటీవల తమకు గాంధీనగర్‌కు చెందిన చేనేత కార్మికులు తమ ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సొసైటీలో సభ్యత్వం ఇప్పించాలని విన్నవించినట్లు చెప్పారు. అంతలోనే చేనేత కార్మిక సంఘం నాయకులు కలెక్టర్ వద్దకు వెళ్లి సదరు అధికారి వ్యవహార తీరుపై ఫిర్యాదు చేశారు. అయితే సంబంధిత అధికారులతో విచారించి తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ చెప్పడంతో చేనేత కార్మికులు శాంతించారు.

అయ్యో.. నేతన్నా

అయ్యో.. నేతన్నా

అయ్యో.. నేతన్నా

అయ్యో.. నేతన్నా