
చేనేత ఉత్పత్తులను ఆదరించాలి : కలెక్టర్
నారాయణపేట: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన నారాయణపేట చేనేత ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం చేనేత, జౌళీశాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో చేనేత కార్మికులు, సహకార సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో చేనేతతో అనేకమంది ఉపాధి పొందుతున్నారని.. వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. చేనేత కార్మికుల స్థితిగతులు, మగ్గాల నిర్వహణ, సమస్యలపై ప్రత్యేకాధికారిని నియమించి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. హౌసింగ్ స్కీం ద్వారా కార్మికుల ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ప్రతి మగ్గాన్ని జియో ట్యాగ్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం చేనేత పొదుపు భరోసా కింద రూ. 25,03,200 చెక్కును కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్, చేనేత సొసైటీ కోటకొండ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గడప జ్ఞానదేవ్, సిల్క్ సంఘం అధ్యక్షుడు రమేశ్, కళ్యాణి, విజయ్ కుమార్, హ్యాండ్లూమ్స్ ఏడీ బాబు పాల్గొన్నారు.
కామన్ డైట్ మెనూ అమలుచేయాలి..
నారాయణపేట రూరల్: ప్రభుత్వం సూచించిన కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల, వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం చేస్తున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వంటగది, సరుకుల నిల్వ గది, విద్యార్థులు నిద్రించే గదులను పరిశీలించారు. కలెక్టర్ వెంట మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రషీద్, ప్రిన్సిపాల్ ఖాజా పాల్గొన్నారు.

చేనేత ఉత్పత్తులను ఆదరించాలి : కలెక్టర్