దామరగిద్ద: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే కాన్‌కుర్తి రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులు అడిగిన మేరకు పరిహారం ఇవ్వాలని.. లేదా ప్రాజెక్టునైనా ఆపాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని కాన్‌కుర్తిలో భూ నిర్వాసితులకు మద్దతుగా బీఆర్‌ఎస్ తరఫున రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా, డీపీఆర్ ప్రకటించకుండా, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, గ్రామాల్లో రైతుల ద్వారా తీర్మానాలు తీసుకోకుండా, భూములకు సరైన పరిహారం ఇవ్వకుండా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. ఇక్కడి రైతులు ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని.. మార్కెట్ విలువ మేరకు తగిన పరిహారం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నారని అన్నారు. ఎకరాకు రూ. 20లక్షల పరిహారం ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. మాట నిలబెట్టుకోకుండా రూ. 14లక్షలు ఇస్తామనడం సిగ్గుచేటన్నారు. భూ నిర్వాసితులకు రూ. 35లక్షల పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. కాన్‌కుర్తి, గడిమున్కన్‌పల్లి, మల్‌రెడ్డిపల్లి గ్రామాల్లో భూములు కోల్పోతున్న వందలాది రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టగా.. అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు పట్టు వీడవకుండా ముందుకుసాగారు. కార్యక్రమంలో నిర్వాసిత రైతు సంఘం నాయకులు వెంకట్రామారెడ్డి, మశ్చందర్, గోపాల్, భీంరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు వెంకట్‌రెడ్డి, సుభాష్, భీమయ్యగౌడ్, అమ్మకోళ్ల శ్రీని వాస్, గవినోళ్ల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రాములు, కిషన్‌రావు, దామోదర్‌రెడ్డి, భీంరెడ్డి పాల్గొన్నారు.