
డిజిటల్ బోధనపై అశ్రద్ధ వహించొద్దు
ధన్వాడ: విద్యార్థులకు డిజిటల్ బోధన అందించడంపై అశ్రద్ధ వహించొద్దని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం ధన్వాడ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం తరగతి గదుల్లో ఏర్పాటుచేసిన స్మార్ట్ టీవీలను ఆయన పరిశిలించారు. ఓ గదిలో స్మార్ట్ టీవీ దుమ్ము పట్టి ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠశాలకు అందించిన స్మార్ట్ టీవీలను వినియోగించి విద్యార్థులకు పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కాగా, పాఠశాలలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయని సిబ్బంది అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. నిర్వహణ నిధులతో మరమ్మతు చేయించాలని ఎంఈఓ గాయత్రికి సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు ఉన్నారు.