
పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పంద్రాగస్టు వేడుకలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకలకు వచ్చే ముఖ్య అతిథి ప్రసంగం సీపీఓ ఆధ్వర్యంలో ఉంటుందని, 8వ తేదీలోగా అన్నిశాఖల అధికారులు సీపీఓకు స్పీచ్ నోట్స్ అందించాలని సూచించారు. తహసీల్దార్ స్టేజీ ఏర్పాట్లు, హార్టికల్చర్ వారు డెకరేషన్, పోలీస్‌శాఖ గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాట్లు చూడాలన్నారు. డీఈఓ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చూడాలన్నారు. అవార్డుల కోసం ప్రతి శాఖ ఇద్దరు లేదా ముగ్గురు అధికారుల పేర్లు పంపాలన్నారు. పౌరసరఫరాలశాఖ డీఎస్‌ఓ, డీఎం స్నాక్స్, టీ ఇతర వసతులు కల్పించాలన్నారు. ట్రాన్స్‌కో వారు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూసుకోవాలన్నారు. జనరేటర్‌ను స్టాండ్ బై ఏర్పాటు చేయాలని తెలిపారు. మత్స్య, పశుసంవర్ధకశాఖ స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్ తదితరులు ఉన్నారు.
● జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గాను టీజీ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి.. నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు 23 దరఖాస్తులు రాగా.. వాటిలో వివిధ శాఖల నుంచి అనుమతులు పొందిన 16 మంజూరుకు డీఐపీసీ కమిటీలో ఆమోదం తెలిపారు. సమావేశంలో జీఎం భరత్ రెడ్డి, నర్సింగ్‌రావు, జి.మేఘాగాంధీ తదితరులు ఉన్నారు.
జయశంకర్ కృషి మరవలేనిది..
నారాయణపేట: తెలంగాణ ఉద్యమంలో ప్రొ. కొత్తపల్లి జయశంకర్ సార్ పాత్ర మరవలేనిదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్‌లో జయశంకర్ సార్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సార్ వెన్నెముకగా నిలిచి, స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేశారని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి ఉమాపతి, డీపీఆర్‌ఓ రషీద్, సీపీఓ యోగానంద్, డీవైఎస్‌ఓ వెంకటేశ్, డీఏఓ జాన్ సుధాకర్, ఏఓ జయసుధ పాల్గొన్నారు.