
సర్వేను అడ్డుకున్న భూ నిర్వాసితులు
● న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్
దామరగిద్ద: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా బుధవారం దామరగిద్ద మండలం మల్‌రెడ్డిపల్లి శివారులో రెవెన్యూ అధికారులు భూ సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న మల్‌రెడ్డి, కాన్‌కుర్తి, గడిమున్కన్‌పల్లి గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు, ప్రజా సంఘాల నాయకులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని అధికారుల సర్వేను అడ్డుకున్నారు. తమకు న్యాయమైన పరిహారం చెల్లించినా తర్వాతే సర్వే నిర్వహించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ రాంచందర్‌నాయక్, డీఎస్పీ లింగయ్య అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే రైతులు ససేమిరా అనడంతో దామరగిద్ద తహసీల్దార్ కార్యాలయంలో చర్చలకు ఆహ్వానించారు. దాదాపు 100 మంది రైతులతో పాటు భూ నిర్వాసిత రైతు సంఘం నాయకులు వెంకట్రామారెడ్డి, గోపాల్, భీంరెడ్డి, నర్సిరెడ్డిలతో అధికారులు చర్చలు జరిపారు. ప్రభుత్వం భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తుందని.. అంతకుమించి పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎకరాకు రూ. 14లక్షల పరిహారంతో తమ భూములను కోల్పోవ డానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. తమకు న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశా రు. రైతులతో చర్చలు ఫలించకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. కాగా, న్యాయమైన పరిహారం కోసం గురువారం అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల మద్దతుతో కాన్‌కుర్తి నుంచి దామరగిద్ద తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు భూ నిర్వాసితులు తెలిపారు.