
బాల్యానికి భరోసా!
నారాయణపేట: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ఎంతో మంది బాలబాలికల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. బడికి వెళ్లి పాఠాలు చదువుకోవాల్సిన చిన్నారులు కొందరు ఇటుక బట్టీలు, హోటళ్లు, పశువులు, గొర్రెల కాపరులుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రతి ఏడాది జనవరి 1నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఏడాది కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ దిశానిర్దేశంతో గత నెలలో ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. వివిధ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి పట్టణ ప్రాంతాలతో పాటు మారుమూల పల్లెల్లో సైతం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 56మంది బాలకార్మికులను గుర్తించడంతో పాటు 20 కేసులు నమోదు చేశారు.
ఏడేళ్లలో 59 కేసులు నమోదు..
2019 నుంచి ప్రతి ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏడేళ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా 1,124 మంది బాలకార్మికులను గుర్తించారు. బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని చెప్పినా వినని వారిపై 59 కేసులు సైతం నమోదు చేశారు. పలువురికి జరిమానాలు విధించారు. ఇదిలా ఉంటే, గత నెలలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా బాలకార్మికులను గుర్తించేందుకు పోలీసు, కార్మికశాఖ, చైల్డ్ లైన్ 1098, సీ్త్రశిశు సంక్షేమశాఖ, బాలరక్ష భవన్, సఖి, ఐసీడీసీ అధికారులు బృందాలుగా ఏర్పడి.. బస్టాండ్లు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు ఇతర పని ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బాలకార్మికులుగా పనిచేస్తున్న పిల్లలను గుర్తించి చర్యలు తీసుకున్నారు. అక్రమ రవాణాకు గురైన బాలలను రక్షించి.. పునరావాసం కల్పించడంతో పాటు చట్టపరమైన హక్కులు, రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు.
సత్ఫలితాన్నిస్తున్న ఆపరేషన్ స్మైల్,
ఆపరేషన్ ముస్కాన్
ప్రతి ఏటా జనవరి, జూలైలో విస్తృతంగా తనిఖీలు
ఏడేళ్లలో 1,124 మంది బాలకార్మికులకు విముక్తి

బాల్యానికి భరోసా!