
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట రూరల్: శారీరక రుగ్మతలను తొలగించుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ఎంతో ఉపకరిస్తుందని డీఈఓ గోవిందరాజులు, డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో ఆదివారం యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యోగా క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన విధానంలో యోగా అలవర్చుకోవాలని సూచించారు. అంతకుముందు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 120 మంది విద్యార్థులు యోగా పోటీల్లో పాల్గొనగా.. చక్కటి ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు.
● జిల్లాస్థాయి యోగా పోటీల్లో సబ్ జూనియర్ విభాగం నుంచి సాయిచరణ్, విఘ్నేశ్, చరణ్‌తేజ, వనజ, లావణ్య, హారిక, జూనియర్ విభాగంలో నందిని, పార్వతి, సృజన, సీనియర్ విభాగంలో బాలకృష్ణ, సూర్యప్రకాశ్, వెంకటేశ్, మల్లికార్జున్, రజిత, ప్రసన్న, రజినీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ భాను ప్రకాశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.