
అక్ర మాలకు చెక్..!
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ (ముఖ గుర్తింపు) అనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి చేయూత పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఈ విధానం అమలుపై సెర్ఫ్ పెన్షన్ విభాగం డీపీఎం, ఏపీఎంలకు ఇది వరకే హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత గ్రామాల వారీగా పంపిణీ చేసే పోస్టల్ శాఖకు సంబంధించిన బీపీఎంలకు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లకు ఇటీవలే అవగాహన కల్పించారు. ప్రభుత్వం జులై 29 నుంచి ఎస్‌ఆర్‌ఎస్ విధానం అమల్లోకి తేవడంతో బయోమెట్రిక్ సమస్యలకు తెరపడినట్లయింది.
పోస్టాఫీసుల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టం
ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పోస్టాఫీసుల్లో మొదటి విడతగా ఫేసియల్ రికగ్నేషన్ సిస్టంతో జిల్లా వ్యాప్తంగా పింఛన్లు చెల్లిస్తున్నారు. ఈ విధానంలో లబ్ధిదారుడి ఫొటో తీసి ఆధార్‌తో సరిపోల్చుకొని యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఫొటోలు తీసినా కూడా యాప్‌లో చూపించకపోతే ఈ సారి బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు ఇచ్చేశారు. బయోమెట్రిక్, ముఖ గుర్తింపు పనిచేయని వారుంటే పంచాయతీ కార్యదర్శులు వేలి ముద్రలు వేసి ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
అవినీతికి ఆస్కారం లేదు
మున్సిపాలిటీల్లో పింఛన్‌ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. కానీ పింఛన్‌దారులు మృతి చెందినా.. వారి కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇవ్వకుండా నగదును ఏటీఎం ద్వారా డ్రా చేసుకుంటున్నారని తెలుస్తోంది. గ్రామాల్లో సైతం మృతి చెందిన ఫించన్‌దారుల డబ్బులను పంచాయతీ కార్యదర్శులు కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పింఛన్ చెల్లింది 45 శాతమే..
మొదటగా పోస్టాఫీస్‌ల్లో పింఛన్ తీసుకునే వారికి ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 74,608 మంది పింఛన్‌దారులుండగా.. వారికి రూ.19.03 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో ఇప్పటి వరకు రూ.8.18కోట్లు ఇవ్వడంతో 45 శాతమే చెల్లించినట్లయింది. ఇంకా 55 శాతం చెల్లించాల్సి ఉంది. జిల్లాలో వృద్ధులు 26,340, చేనేత 2,546, వితంతువులు 30,259, గీత కార్మికులు 900, బీడీ వర్కర్లు 1,172, ఒంటరి మహిళలు 3,160, వికలాంగులు 9,957, ఫైలేరియా పేషెంట్లు 164, డయాలసిస్ పేషెంట్లు 110 మంది ఉన్నారు. సాధారణ పింఛన్‌దారులకు రూ. 2,016, దివ్యాంగులకు రూ.4,016 ఇస్తున్నారు.
చేయూత లబ్ధిదారుల ముఖం స్కాన్ చేస్తేనే పింఛన్ అందజేత
జిల్లాలో 74,608 పింఛన్‌దారులు
పింఛన్ చెల్లించింది 45 శాతమే
ఎఫ్‌ఆర్‌ఎస్‌పై సిబ్బందికి శిక్షణ

అక్ర మాలకు చెక్..!