ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల

Jun 8 2025 12:26 AM | Updated on Jun 8 2025 12:26 AM

ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల

ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత నెల మొదటి వారంలో జరిగిన ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి 559 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 374 మంది (67.09 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 455 మంది పరీక్ష రాయగా.. 255 మంది (52.43 శాతం), వనపర్తి జిల్లా పరిధిలో 346 మందికి గాను 289 (88.59 శాతం), నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 353 మందికి గాను 235 (67.10 శాతం), నారాయణపేటలో 503 మంది పరీక్ష రాయగా.. 424 మంది (84.48 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు.

● ఇంటర్మీడియట్‌కు సంబంధించి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 841 మంది పరీక్ష రాయగా.. 490 మంది (60.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 652 మందికి గాను 412 (63.12 శాతం), వనపర్తి పరిధిలో 510 మందికి గాను 370 మంది (72.84 శాతం), నాగర్‌కర్నూల్‌లో 746 మందికి గాను 546 మంది (73.30 శాతం), నారాయణపేట జిల్లాలో 897 మందికి గాను 528 మంది (59.62 శాతం) నమోదు చేసినట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్‌, ఉమ్మడి జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ శివయ్య పేర్కొన్నారు.

రైతులపై పెట్టిన

కేసులు ఎత్తివేయాలి

పాలమూరు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ చేసిన దీక్షల నేపథ్యంలో రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటు కోసం 2023లో అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కానీ, 12 గ్రామాల రైతులు, ప్రజలు కంపెనీ ఏర్పాటు చేయవద్దని కోరుతున్నారని చెప్పారు. సరైన న్యాయం కోసం శాంతియుతంగా దీక్షలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే చిత్తనూర్‌లో ఇథనాల్‌ కంపెనీ వల్ల పెరిగిన కాలుష్య పరిస్థితిని అర్థం చేసుకుని కంపెనీ రద్దు చేయకపోతే తమ భవిష్యత్‌ కోల్పోవాల్సి వస్తోందని ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

శనేశ్వరుడికి

ప్రత్యేక పూజలు

బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌ శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఏలినాటి శనిదోష నివారణకు అక్కడే స్నానాలు చేసి నల్లటి వస్త్రాలు ధరించగా వారితో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ప్రత్యేక పూజలు చేయించి స్వామివారికి నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నల్ల నువ్వులను సమర్పింపజేశారు. అనంతరం భక్తులు పక్కనే ఉన్న శివాలయాన్ని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి బారులు తీరారు.

పురిటిగడ్డ రుణంతీర్చుకుంటా : మంత్రి

చిన్నంబావి: తను పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం స్వగ్రామైన పెద్దదగడలో ఆయన గ్రామస్తులతో కలిసి వీధుల్లో పర్యటించి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను ఇంతటివాడిని చేసిన గ్రామానికి ఎంతో చేయాల్సి ఉందని.. రానున్న కొద్దిరోజుల్లో గ్రామ రూపురేఖలు మార్చేందుకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారి విస్తరణ, రూ.రెండు కోట్లతో తిరుమలనాథస్వామి ఆలయ మరమ్మతులు, తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగించేందుకు 1.20 లక్షల లీటర్ల సామర్థ్యంగల నీటి ట్యాంకును నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా గ్రామానికి 100కు పైగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి మట్టి మిద్దె లేని గ్రామంగా చూడాలన్నదే తన సంకల్పమని వివరించారు. పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సరిగా లేదని రైతులు అడగగా.. రహదారి నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తానన్నారు. అదేవిధంగా మండలకేంద్రంలోని ప్రధాన కూడలిని రూ.కోటితో పట్టణ స్థాయిలో పార్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. టాయిలెట్స్‌ లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి తీసుకురాగా.. తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కొప్పునూరులో బీరప్ప ఆలయంలో పూజలకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement