సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 24న కోస్గి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డా.వినీత్ అన్నారు. కోస్గిలో కొత్త సర్పంచుల సన్మాన సభ నిర్వహించే లక్ష్మీనర్సింహ ఫంక్షన్‌హాల్‌తో పాటు హెలిప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వీఐపీ పార్కింగ్ స్థలాలు, బారికేడ్లు తదితర భద్రతాపరమైన ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పి లింగయ్య, సీఐ సైదులు, ఎస్‌ఐలు బాల్‌రాజ్, వినయ్‌కుమార్, నరేశ్, తహసీల్దార్ శ్రీనివాసులు ఉన్నారు.
52 కేసుల్లో రూ.25.58 లక్షల రికవరీ
నారాయణపేట: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో సైబర్ నేరాల బాధితులకు గణనీయమైన ఉపశమనం లభించిందని.. మొత్తం 52 కేసుల్లో రూ. 25.58లక్షలు రికవరీ చేసినట్లు ఎస్పీ డా.వినీత్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 12 పోలీస్‌స్టేషన్లలో 167 క్రైం కేసులు, డ్రంకెన్ డ్రైవ్ 364, ఈ పెట్టీ 1,513 కేసులతో కలిపి మొత్తం 2,044 కేసులను పరిష్కరించగా.. సుమారు రూ. 5లక్షల వరకు జరిమానా చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే సైబర్ మోసం జరిగిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేయడం అత్యంత కీలకమని ఎస్పీ సూచించారు. అలా చేయడం వల్ల పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. సైబర్ నేరాల విచారణలో సమర్థవంతంగా పనిచేసి.. బాధితులకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


