పల్లెసీమల్లో నవశకం
● గ్రామపంచాయతీల్లో
కొలువుదీరిన పాలకవర్గాలు
● అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవాలు
● గ్రామాల్లో పండుగ వాతావరణం
నారాయణపేట: పల్లెసీమల్లో నవశకం ఆరంభమైంది. అన్ని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. పండుగ వాతావరణంలో సర్పంచులు, వార్డు సభ్యులతో పంచాయతీ కార్యదర్శులు ప్రమాణం చేయించారు. జిల్లావ్యాప్తంగా 272 మంది సర్పంచులుగా, 2,466 మంది వార్డు మెంబర్లుగా విజయం సాధించగా.. ఎన్నికల అధికారులు ధ్రువపత్రాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రమాణం చేయించారు. అనంతరం సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో 272 జీపీలు ఉండగా.. 271 జీపీల్లో తొలి గ్రామసభలు జరిగాయి. ధన్వాడ మండలంలోని మడిగెలములతండా సర్పంచ్ బంధువు ఒకరు మృతిచెందడంతో గ్రామసభ వాయిదా పడింది. మక్తల్ మండలం ముస్లాయిపల్లిలో ఒక్క ఓటుతో గెలుపొందిన సర్పంచ్ పవిత్రమ్మ, ఉపసర్పంచ్ సురేష్, వార్డు సభ్యులు పోలీసు బందోబస్తు నడుమ ప్రమాణం చేశారు. కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకరోత్సవానికి గ్రామస్తులను సైతం కాస్త దూరంగానే ఉంచారు.
ఎన్నో ఆశలు.. ఆశయాలతో
ఎన్నో ఆశలు, ఆశయాలతో కొలువుదీరిన పంచాయతీల పాలకవర్గాలకు నిధులలేమి అసలు సమస్యగా కనిపిస్తోంది. పంచాయతీలకు ఇంటి పన్నులు తప్ప.. ఇతర ఆదాయ వనరులు పెద్దగా ఉండవు. కార్మికుల జీతాలు, విద్యుత్ చార్జీలు, చెత్త సేకరణ ట్రాక్టర్లకు డీజిల్, నీటి వనరుల సంరక్షణ వంటి వాటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. గత ప్రభుత్వ హయాంలో రైతువేదికలు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను నిర్మించారు. అవసరాలకు మూలం నిధులే కావడంతో ప్రభుత్వం సరిపడా నిధులు ఇవ్వాలని కొత్త పాలకవర్గాలు కోరుతున్నాయి.
సన్మానాలు.. అభినందనలు
జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీల మద్దతుతో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులను కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలతో ముంచెత్తారు. గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ డా.వినీత్ దిశానిర్దేశంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
విధులు.. బాధ్యతలు
గ్రామ పంచాయతీల పరిపాలకులుగా సర్పంచులు వ్యవహరిస్తూ గ్రామసభలు నిర్వహించాలి. ఎన్నిక తర్వాత 15 రోజుల్లో తొలి గ్రామసభ జరపాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేలా చొరవ తీసుకోవాలి. బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ వంటి కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులపైనే ఉంటుంది. పంచాయతీ ఆర్థిక నిర్వహణ, లాభనష్టాల రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. పీఎం ఆవాస్ యోజన వంటి పథకాల్లో పారదర్శకత ఉండాలి.
ఒకే కుటుంబంలో ముగ్గురు..
ధన్వాడ మండలం రామకిష్టాయిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాణస్వీకారం చేశారు. సర్పంచ్‌గా కవిత, వార్డు సభ్యులుగా ఆమె భర్త తిరుపతి నాయక్, మరిది శంకర్‌నాయక్ బాధ్యతలు చేపట్టారు.


