వందశాతం లక్ష్యాలు సాధించాలి
నారాయణపేట: జిల్లాలోని నర్వ యాస్పరేషన్ బ్లాక్‌లో వందశాతం లక్ష్యాలను సాధించాలని సెంట్రల్ ప్రభారీ అధికారి స్వప్నాదేవిరెడ్డి అన్నారు. నర్వ యాస్పరేషన్ బ్లాక్ ప్రాజెక్ట్ ప్రగతిపై కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి రంగాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సెంట్రల్ ప్రభారీ అధికారిణి మాట్లాడుతూ.. నర్వ యాస్పరేషన్ బ్లాక్‌లో సూచికల ప్రకారం కొన్ని గణాంకాలు సరిగ్గా నమోదు కాలేదన్నారు. డాటా, సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా సాంకేతిక లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బ్లాక్‌లో నిర్దేశించిన అన్ని సూచికల్లో వందశాతం లక్ష్యాల సాధ న దిశగా ముందుకు సాగాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్‌సుధాకర్, డీపీఓ సుధాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ డా.జయచంద్రమోహన్, డీఈఓ గోవిందరాజులు, నోడల్ అధికారి హీర్యానాయక్, తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, యాస్పరేషన్ బ్లాక్ సమన్వయకర్త బాలాజీ ఉన్నారు.
● స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్‌రెడ్డి వీసీ నిర్వహించగా.. కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నుంచి ఇన్‌చార్జి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలన్నారు. వారంలోగా పురోగతి కనిపించాలని.. లేనిచో సంబంధిత బీఎల్‌ఓలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా ఓటరు జాబితాలో బ్లర్‌గా ఉన్న ఫొటోలను పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించి.. ఫాం–8 ద్వారా ఫొటోలను బీఎల్‌ఓలతో అప్‌డేట్ చేయించే ప్రక్రియను కూడా పూర్తిచేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్ పాల్గొన్నారు.


