రికార్డు స్థాయిలో వరదలు వచ్చినా క్రాప్‌హాలిడేనా?
● చేతకాని పాలనకుఇదే నిదర్శనం
● మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఈసారి రికార్డు స్థాయిలో వరదలు వస్తే అవగాహన లేకుండా సముద్రంపాలు చేసి.. ఇప్పుడు క్రాప్‌హాలిడే ప్రకటించడం దురదృష్టకరమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూర్‌లో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణానదికి వచ్చిన వరదను ప్రణాళికా బద్ధంగా వాడుకోకుండా యాసంగిలో క్రాప్‌హాలిడే ప్రకటించడం చేతకాని పాలనకు నిదర్శనమన్నారు. 1981లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య 17.8 టీఎంసీల డిజైన్‌తో ప్రారంభించిన జూరాల ప్రాజెక్టును 11 టీఎంసీలకు కుదించారని.. ఆ తర్వాత 6.5 టీఎంసీలకే ప్రాజెక్టు పరిమితమైందన్నారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 33 ఏళ్ల సమయం పట్టిందన్నారు. ప్రస్తుత పాలకులు ఏకంగా క్రాప్‌హాలిడే ప్రకటించడం బాధాకరమన్నారు. కేసీఆర్ ముందుచూపుతో నిర్మించతలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్‌కు కేటాయించిన 15.9 టీఎంసీలు, జూరాలకు కేటాయించిన 17.8 టీఎంసీల నీటిని వాడుకోలేని దుస్థితి నెలకొందన్నారు. కొడంగల్–నారాయణపేటకు ఎత్తిపోతలకు పాలమూరు–రంగారెడ్డి నుంచే నీటిని పంపింగ్ చేసే విధంగా తక్కువ ఖర్చుతో డిజైన్ చేస్తే.. ప్రస్తుతం ఎక్కువ ఖర్చుతో కొడంగల్–పేట ఎత్తిపోతల పథకం డిజైన్ మార్చడం సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన రాహి త్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి యాసంగిలో సాగునీరు ఇవ్వలేమని చెప్పడం సిగ్గుచేటని.. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి నీరు తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారని.. ఇందుకు సంబంధించి ఆధిత్యనాధ్ ఏపీ తరఫున, తెలంగాణ తరఫున ఎస్‌కే జ్యోషి చేసిన సంతకాల పత్రాలను చూయించారు. కేసీఆర్ మరణశాసనం చేశారని పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రి సలహదారుగా ఉన్న ఆధిత్యనాఽథ్‌ను సంతకం ఎందుకు చేశారో అడగాలని సవాల్ విసిరారు. షాపుల్లో యూరియా ఇవ్వలేని వారు యాప్ ద్వారా ఇస్తామని చెబుతున్నారని.. ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవియాదవ్ తదితరులు ఉన్నారు.


