తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
కృష్ణా: వేసవి నేపథ్యంలో ఏ గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సత్యసాయి తాగునీటి సరఫరా అధికారులకు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. గురువారం మండలంలోని కున్సీ, కృష్ణా, గుడెబల్లూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం సత్యసాయి నీటి పంప్‌ను ఆయన సందర్శించి అక్కడ నీరు సరఫరా చేసే అధికారులతో మాట్లాడారు. ఇదిలాఉండగా, సత్యసాయి నీటి సరఫరా చేస్తున్న ఉద్యోగి ఆర్నెళ్లుగా వేతనం రావడంలేదని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలి
నారాయణపేట: పాఠశాలలకు వేసవి సెలవులు అమలు చేస్తుండగా అదే పాఠశాలలో పరిధిలో పనిచేస్తున్న అంగన్‌వాడీ సెంటర్లకు సెలవు లేకపోవడం సరైనది కాదని వెంటనే, వేసవి ఎండల దృష్ట్యా సెలవులు ప్రకటించాలని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శశికళతోపాటు బాల్‌రాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మే నెల సెలవులు అమలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఎండల తీవ్రతతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందని, వెంటనే సెలవులు ఇవ్వాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌కు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో జోషి, పుష్ప, రాధిక ,సావిత్రమ్మ, బుగ్గమ్మ, సుజాత, చంద్రకళ, ఉమా మణిమాల తదితరులు పాల్గొన్నారు.
హజ్ యాత్రికులకువ్యాక్సినేషన్
నారాయణపేట: హజ్ యాత్రికుల కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో గురువారం టీకా శిబిరాన్ని నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శైలజతో కలిసి ఈ శిబిరాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. మొత్తం 33 మంది హజ్ యాత్రికులకు టీకాలు వేశారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, హజ్‌యాత్ర కమిటీ సభ్యులు అమిరుద్దీన్, ముజాహిద్ సిద్దిఖీ,అజారోద్దీన్, అజిమ్ మడ్కి, వైద్యులు సాయిరాం, డీఐఓ గోవింద రాజు , ఎంపీహెచ్‌ఈఓ సూర్యకాంత్ రెడ్డి పాల్గున్నారు.
నేడు డయల్ యువర్ ఏటీఎం లాజిస్టిక్
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ లాజిస్టిక్ సమస్యల కోసం శుక్రవారం డయుల్ యువల్ ఏటీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇసాక్ బిన్ మహ్మద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ కార్గో సంబంధిత సమస్యలను 8125456978 నంబర్‌కు ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని కార్గో వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రామన్‌పాడులో 1,015 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో గురువారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు గాను 1,015 అడుగులు ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. దీంతో జలాశయంలోని ఎన్టీఆర్ కాల్వ ద్వారా 2 క్యూసెక్కులు, కుడి, ఎమడ కాల్వల నుంచి 18, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వదిలామని ఆయన చెప్పారు.
తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు


