లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేయాలి
నారాయణపేట: యాసంగి 2024 –25కు గాను ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వరి కొనుగోళ్ళు – కేంద్రాల ఏర్పాట్లపై ఆమె సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సారి సన్నరకం వరి ధాన్యానికి రూ.500 బోనస్ పెంచిందని, దీంతో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, పారదర్శకంగా, నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కాగా జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉండవచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేసినట్లు అదనపు కలెక్టర్ బేన్‌షాలం కలెక్టర్‌కు తెలిపారు. అయితే ఏప్రిల్ రెండో వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఐకెపి, సింగిల్ విండో, మెప్మా ద్వారా జిల్లాలో దాదాపు 102 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాల ద్వారా లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను అనుకూలమైన ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని, ధాన్యం సేకరణకు అవసరమైన తేమ శాతం కొలిచే యంత్రాలు, టార్ఫాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని, ఇంకా అవరమైన వాటి కోసం ఇండెంట్లు పెట్టి తెప్పించుకోవాలని ఆమె సూచించారు. సమీక్షలో ఆర్డీఓ రామచంద్ర నాయక్, డిఆర్డిఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్,సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు, అధికారులు బాల్ రాజ్, మేఘా గాంధీ, అంజయ్య, సింగిల్ విండో అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ రోడ్ సేఫ్టీ సమావేశంలో ఎస్పీ యోగేష్‌గౌతమ్‌తో కలిసి కలెక్టర్ గత జనవరి 7న జరిగిన రోడ్ సేఫ్టీ మీటింగ్‌లో చర్చించిన అంశాలు, చేపట్టిన పనులు శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమష్టిగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమాలు, బ్లాక్‌స్పాట్‌ల గుర్తింపు, ప్రధాన రహదారులపై ఉన్న పాఠశాలలు, కళాశాలల వద్ద బారికేడ్స్ ఏర్పాటుపై ఎస్పీ వివరించారు. నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, రోడ్ సేఫ్టీ ఎన్ ఫోర్స్ మెంట్ బృందాల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.
నిబంధనల మేరకులే అవుట్లకు అనుమతులు
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లే –అవుట్లకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ లేఔట్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లేఅవుట్ల అనుమతుల జారీ విషయంలో అధికారులు అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. మూడు లేఅవుట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై ఆయా శాఖల అధికారుల నుంచి క్లియరెన్స్ అడిగారు.


