నంద్యాల(అర్బన్): మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ శివప్రసాదరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలో 52 మంది వార్డు కౌన్సిలర్లతో పాటు నేరుగా ఎన్నికై న చైర్‌పర్సన్, అర్హత కలిగిన ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లను కలిపి మొత్తం 56 ఓట్లు ఉంటాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 24 మంది కౌన్సిలర్లు, బీజేపీ ఒకరు గెలుపొందగా వైఎస్సార్‌సీపీ తరపున 27 మంది కౌన్సిలర్లు గెలుపొందారన్నారు. టీడీపీ చైర్‌పర్సన్‌తో పాటు ఇద్దరు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిసి ఎన్‌డీఏ కూటమికి 28 ఓట్లు వస్తాయని, వైఎస్సార్‌సీపీకి గెలుపొందిన 27 మంది కౌన్సిలర్లతో పాటు ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలిపి ఆ పార్టీ కూడా 28 ఓట్లు ఉంటాయన్నారు. వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఇరుపక్షాలకు సమానంగా ఓట్లు వస్తే చైర్‌పర్సన్‌కు అదనపు నిర్ణయాత్మక ఓటు ఉండదని, ఎవరూ గైర్హాజరు కాకుండా, క్రాస్ ఓటింగ్ జరగకుండా ఓట్లు సమానంగా నమోదు అయితే నిబంధనల ప్రకారం డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా విజేతను నిర్ణయించనున్నట్లు తెలిపారు.
నేడు జెడ్పీ చైర్మన్ ఎన్నిక
నంద్యాల(అర్బన్): జెడ్పీ చైర్మన్ ఎన్నిక శుక్రవారం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను గురువారం ఆమె పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జెడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జెడ్పీ సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి
● డీఈఓ జనార్దన్ రెడ్డి
సంజామల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కానాల పేరుసోముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులను, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటున్నారు. డీఈఓ వెంట ఎంఈఓ రమణారెడ్డి ఉన్నారు.
కలెక్టరేట్‌లో పింక్ టాయిలెట్స్
నంద్యాల(న్యూటౌన్): ఉద్యోగుల సౌకర్యార్థం కలెక్టరేట్‌లో అత్యాధునిక వసతులతో కూడిన ఆస్పిరేషనల్ పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్‌ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న జిల్లా అధికారులతో కలిసి గురువారం కలెక్టరేట్‌లో వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల మరుగుదొడ్డిని సులభంగా గుర్తించేందుకు పింక్ కలర్ థీమ్‌ను రూపొందించారన్నారు. చిన్నపిల్లలకు పాలిచ్చే తల్లుల సౌకర్యార్థం ప్రత్యేక విశ్రాంతి గదిని ఏర్పాటు చేశామన్నారు.
28న నవోదయ ప్రవేశ పరీక్ష
ఎమ్మిగనూరు రూరల్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల 28న బనవాసి జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశానికి 28 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యాలయం ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 16, నంద్యాల జిల్లాలో 12 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి 6,970 మంది విద్యార్థులు ఽపరీక్షకు హాజరవుతున్నట్ల తెలిపారు. ఈ నెల 23న కర్నూలు మాంటిస్సోరి స్కూల్ (ఏ క్యాంప్)లో పరీక్ష విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు శిక్షణనిస్తామన్నారు. అభ్యర్థులకు సందేహాలుంటే 08512–229454, 965230633, 9985738899 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.


