దమ్ముంటే పోటీ చేసి గెలవాలి | - | Sakshi
Sakshi News home page

దమ్ముంటే పోటీ చేసి గెలవాలి

Nov 20 2026 1:37 AM | Updated on Nov 20 2026 1:37 AM

● శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్‌

బొమ్మలసత్రం: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేసి తిరిగి బుడ్డా రాజశేఖర్‌ రెడ్డికి గెలవాలని, గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్‌ విసిరారు. పోలీసుల అండతో, అధికార బలంతో కాకుండా ప్రజల మధ్యకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నారు. నంద్యాలలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో శిల్పా మాట్లాడారు. సున్నిపెంటలో టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. నామినేషన్‌ వేస్తున్న వారిని చూసేందుకు వచ్చిన తనను పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారన్నారు. చివరకు అరెస్టు చేసి, నంద్యాలకు తీసుకొచ్చారన్నారు. పోలీసుల తీరు చూస్తుంటే ఖాకీ దుస్తుల్లో పచ్చ కండువాలు కప్పుకున్నట్లుగా ఉందన్నారు. డీఎస్పీ సైతం తనతో దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమన్నారు. నామినేషన్లు ప్రశాంతంగా వేసుకోవచ్చని పోలీసులు చెబుతూనే మరోవైపు తనను అడ్డుకోవడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. సున్నిపెంటలో ఏకగ్రీవం కావాలని ఎమ్మెల్యే కోరుతున్నారని, ఏకగ్రీవం కోసం సహకరించాలని చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు.

సున్నిపెంటకు పంచాయతీ హోదా

తెచ్చింది వైఎస్సార్‌ ఘనతే

సున్నిపెంటను గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడంలో మహానేత వైఎస్సార్‌ కీలక పాత్ర పోషించారని శిల్పా తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనూ పంచాయతీ హోదా సాధనకు తాము కృషి చేశామని చెప్పారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు సున్నిపెంట అభివృద్ధికి ఏమి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

డాక్టర్‌ను సైతం భయపెట్టారు!

గతంలో మున్సిపల్‌ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్‌ వేయడానికి వచ్చిన ఓ మహిళా డాక్టర్‌ను సైతం భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఇప్పుడు సున్నిపెంటలోనూ అదే తరహా రాజకీయాలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్కరు కూడా నామినేషన్‌ వేయకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు వ్యవహరిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. సున్నిపెంట ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తమ ఓటుతో సమాధానం చెబుతారన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేత శిల్పాభువనేశ్వర రెడ్డి, న్యాయవాది రామ్మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement