శ్రీశైలం: భక్తుల సౌకర్యం కోసం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి సింహాచలానికి చెందిన ఆర్ రంగారావు రూ.1,00116 విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం మొత్తాన్ని దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు చేతికి అందజేశారు. దాతకు ప్రసాదాలను అందజేసి సత్కరించారు.
ఎండిపోయిన పంటలు
దొర్నిపాడు: రబీలో సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయాయి. జొన్న, మినుము, పత్తి, కంది పంటలు బెట్టుపోయి చేతికి రాకుండపోయాయి. చాలా మంది రైతులు ఒక్కో ట్యాంకరుకు రూ.వెయ్యి ఖర్చు చేసి పంటలను కాపాడుకుంటున్నారు. ఖరీఫ్‌లో కేసీ కెనాల్ కింద సాలు వరి సాగు చేసి నష్టపోయామని, రబీలో జొన్న సాగు చేస్తే పూర్తిగా ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీకి ఒక్క తడికి నీరు వదిలినా బాగుపడేవాళ్లమని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఖనిజ అక్రమ తవ్వకాలు
● గాయపడిన కార్మికుడు
డోన్ రూరల్: లీజులు లేకుండానే ప్యాపిలి మండలం బావిపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో టీడీపీ నేతలు ఆక్రమ ఖనిజాల తవ్వకాలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా ముగ్గురాళ్ల గనిలో ప్రమాదం జరిగి బుధవారం సాయంత్రం పిట్టల నాగరాజు అనే యువకుని చేతి వేళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన కార్మికుడిని టీడీపీ నేత గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించి వైద్య చిక్సిత చేయిస్తునట్లు తెలిసింది. స్థానిక ప్రజాప్రతినిధి అండతో ముగ్గురాళ్ల గనుల్లో రెండేళ్లుగా ఆక్రమ మైనింగ్ సాగుతోంది. అధికారులు మామూళ్లమత్తులో మునిగి తేలుతూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బావిపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమ మైనింగ్ చేసే వారిని వెంటనే ఆరెస్టు చేయాలని కోరుతున్నారు.
యూపీపీఎస్‌సీ సివిల్స్ ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్
కర్నూలు(అర్బన్): యూపీపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు సంసిద్ధులయ్యేందుకు అర్హులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన తెలిపారు. స్థానిక బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణను పొందగోరు అభ్యర్థులకు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్క్రీనింగ్ టెస్ట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికై న వంద మందికి విజయవాడలోని వెలగపూడి ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌లో ఆరు నెలల పాటు ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణను అందిస్తారన్నారు. జిల్లాలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్‌కు మొత్తం 50 మంది దరఖాస్తు చేసుకోగా, 41 మంది హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమ సాధికారత అధికారి ఆంజనేయులునాయక్ తదితరులు పాల్గొన్నారు.
సైనిక్ స్కూల్ అడ్మిషన్లకు జనవరి 31న ప్రవేశ పరీక్ష
కర్నూలు(సెంట్రల్): సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు జనవరి 31వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబర్ 2లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2027–28 విద్యా సంవత్సరానికి అన్నమయ్య జిల్లా కలికిరి సైనిక్ స్కూల్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జనవరి 31న ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు https://nta.ac.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన సమాచార బులెటిన్, బ్రోచర్‌ను https://sskal.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.


