పంచాయతీ పోరులో ఇప్పుడు ప్రధానంగా అధికార పార్టీ నాయకులతో పోరాటం కన్నా పోలీసులతో పోరాటం చేయాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ మద్దతుదారులు పేర్కొంటున్నారు. బుధవారం ఉదయమే తుమ్మలపెంట, గొర్విమానుపల్లె, అబ్దులాపురం, కమ్మవారిపల్లెలో నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కొందరిని నేరుగా పోలీస్ స్టేషన్కు పిలిపించి ఈరోజు నామినేషన్లు వేయరాదని చెప్పారు. అంతా సిద్ధం చేసుకున్నాక ఎందుకు వద్దంటున్నారని పోలీసుల తీరుపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. మండలంలో కొన్ని పంచాయితీల్లో టీడీపీ మద్దతు దారులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదనే కారణంతో పోలీసుల ద్వారా ఈ కుట్రకు తెరలేపినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. తుమ్మలపెంట, కనకాద్రిపల్లె నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాపు కాశారు. వైఎస్సార్సీపీ సర్పంచ్, వార్డు అభ్యర్థులు వస్తే అడ్డుకునేందుకు సిద్ధపడ్డారు. బందార్లపల్లెకు చెందిన గోగుల సుగుణమ్మ స్వతంత్ర అభ్యర్థిగా సహాయకులతో తుమ్మలపెంట నామినేషన్ కేంద్రానికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ కార్యకర్తలు నామినేషన్ వేయకుండా అడ్డుకొని వెనక్కి పంపారు. నామినేషన్లకు గడువు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో సజావుగా వేయనిస్తారా లేక అడ్డుకుంటారా అని అభ్యర్థులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మద్దతు లేక ఓడిపోతామనే భయంతోనే ఈ కుట్రలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


