● ఎంపీపీ ఎన్నికలకు వెళ్లకుండా
అడ్డుకున్న పోలీసులు
కర్నూలు(టౌన్): ఎంపీపీ ఎన్నికల వేళ నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కర్నూలులోని కిసాన్‌నగర్‌లో గురువారం మూడో పట్టణ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఉదయాన్నే ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో నందికొట్కూరుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై బైరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పోలీసుల ద్వారా ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నించారు. తనను హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. నందికొట్కూరుకు వెళ్లకుండా అడ్డుకోవడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ బలం ఉన్న
మండలాలపై టీడీపీ కుట్రలు
మిడుతూరు మండలంలో వైఎస్సార్సీపీ 8 ,టీడీపీ 4, కొత్తపల్లి మండలంలో వైఎస్సార్సీపీ 5, టీడీపీ 04, పాములపాడు మండలంలో వైఎస్సార్సీపీ 06, టీడీపీ 05 స్థానాల్లో గెలిచిందన్నారు. పాములపాడులో ఇండిపెండెంట్ అభ్యర్థి సైతం వైఎస్సార్సీపీలో చేరడంతో తమ బలం పెరిగిందన్నారు. అనుకూలంగా ఉన్న పరిస్థితులను ప్రభావితం చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు అడగడం మినహా టీడీపీ నేతలు ఇతర అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న అనుమానాలకు తావులేకుండా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఒకవైపు తన ను హౌస్ అరెస్ట్ చేసి మరోవైపు ఎన్నికల ప్రక్రియలో ఏకపక్షంగా వ్యవహరించేందుకు అవకాశం కల్పిస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే అన్నారు.
సీసీఫుటేజ్ బయటపెట్టాలి
ఎంపీటీసీ నామినేషన్ల నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు టీడీపీ నాయకులు దౌర్జన్యాలు చేశారని బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున వైఎస్సార్సీపీ నేతలందరినీ అక్రమంగా అరెస్టులు చేయించడం, పోలింగ్ బూత్ నుంచి ఏజెంట్లను బెదిరించి తరిమి వేయడం.. ఇలా ఎన్నో చేశారన్నారు. గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఓడిపోయినట్లు, తిరస్కరణ గురయిన ఓట్లను టీడీపీ అభ్యర్థికి కట్టబెట్టి గెలిచినట్లు ప్రకటించడం దుర్మార్గమన్నారు. ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల్లో అదే దుష్ట సంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం పోలీసులతో చేస్తోందన్నారు. ప్రభుత్వానికి దమ్ము దైర్యం ఉంటే పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీఫుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.


