కర్నూలు కల్చరల్: ఈ–వ్యర్థాలైన పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బ్యాటరీలు, చార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అధీకృత రీసైక్లింగ్ కేంద్రాలకు అందజేయాలని అటవీ శాఖ కర్నూలు రేంజ్ ఎఫ్‌ఆర్‌వో ప్రియాంక సూచించారు. బ్రిక్స్ సుస్థిర జీవన శైలి వారోత్సవాలు –2026లో భాగంగా శుక్రవారం స్థానిక కట్టమంచి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌వో మాట్లాడుతూ.. ఈ వ్యర్థాలను సాధారణ చెత్తతో కలిపి పడేయకూడదన్నారు. పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ పరికరాలను తిరిగి ఉపయోగించాలన్నారు. పాడైన పరికరాలను వీలైనంత వరకు మరమ్మతులు చేయించి వినియోగించాలని సూచించారు. ఉపయోగించడానికి వీలులేని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను విడిగా సేకరించి, అధీకృత రీసైక్లింగ్ కేంద్రాలకు అందజేయాలన్నారు. ఈ–వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే కాలుష్యంపై గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ–వ్యర్థాలను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని పిలుపునిచ్చారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఓబులేష్, బీట్ ఆఫీసర్ రేణుక తదితరులు పాల్గొన్నారు.


