నంద్యాల(న్యూటౌన్): నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌జీ చెస్ అకాడమీ నిర్వహణలో శుక్రవారం రోటరీ ఇంగ్లిష్ మీడియం పాఠశాల్లో కరెస్పాండెంట్ సుబ్బయ్య అధ్యక్షతన జిల్లాస్థాయి మూడవ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ పోటీలను జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి చదువుతో పాటు కళలు, క్రీడలు దోహదం చేస్తాయన్నారు. చదరంగం మేధోశక్తికి పదును పెడుతుందన్నారు. వివిధ వయస్సు వారికి 12 విభాగాల్లో వేర్వేరుగా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారికి మొత్తం 12 ప్రైజ్‌లను ఇవ్వడం జరుగుతుందన్నారు. విజేతలకు రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, సుష్మ, నస్రీన్, సుజాత, సురేష్, మాధవి, రమ్యా, సురేష్‌కుమార్, అరుణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
బనగానపల్లె: బనగానపల్లె పోలీసు స్టేషన్ పరిధిలోని పాతపాడు సమీపంలో చిన్నరాజుపాళెం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ డీపీ బాషా (46) శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నరాజుపాళెం గ్రామానికి చెందిన డీపీ బాషా బనగానపల్లె ఆర్టీసీ డీపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. బనగానపల్లె నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా పాతపాడు గ్రామ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. సమీప పొలాల్లో పని చేసేవారు హుటాహుటిన అక్కడికి వచ్చే సరికి ప్రమాదం చేసిన వ్యక్తి వాహనంతో పరారయ్యాడు. మృతుడికి భార్య దస్తగిరమ్మ, ముగ్గురు సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వెల్దుర్తి: స్థానిక డోన్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణగిరి మండలం తొగర్చెడుకు చెందిన మాదన్న (59) మృతి చెందాడు. ఈ ఘటనపై శుక్రవారం మృతుడి భార్య నాగేశ్వరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మాదన్న ఎక్స్‌ఎల్ బైకుపై వెల్దుర్తికి వచ్చి తిరుగు ప్రయాణంలో పెట్రోల్ పోయించుకునేందుకు టర్నింగ్ చేసుకుంటుండగా డోన్ వైపు నుంచి వెల్దుర్తికి చెందిన సుధాకర్ బైక్‌పై వేగంగా వస్తూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మాదన్న కిందపడి గాయాలపాలయ్యాడు. అక్కడున్నవారు స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి చేరుకున్నారు. మెరుగైన వైద్యంకోసం 108 అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వెల్దుర్తి ఎస్‌ఐ నరేశ్ తెలిపారు.
రైలు కింద పడి ఆత్మహత్య
ఆదోని సెంట్రల్: మండలంలోని చిన్నహరివాణం కు చెందిన మేకల నాగరాజు (30) గురువారం అర్ధరాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు ఐదేళ్ల నుంచి ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. వ్యాధి నయం గాకపోవడంతో పా టు అప్పులు సుమారు రూ.10 లక్షలు ఉండటంతో వాటిని తీర్చలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతుడి భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సి.శివరామయ్య శుక్రవారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వెల్దుర్తి సీహెచ్‌సీలో రాష్ట్ర బృందం తనిఖీ
వెల్దుర్తి: స్థానిక సీహెచ్‌సీని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ జే.నరసింహ నాయక్, బృంద సభ్యులు శుక్రవారం డీసీహెచ్‌ఎస్ జఫ్రుల్లాతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఆసుపత్రి ఆధునిక భవనం, సరిపడా వైద్యులు, సిబ్బంది ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ, ఆపరేషన్ థియేటర్, వార్డు లు, ఫార్మసీ, ల్యాబ్‌లు తనిఖీలు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల పై ఆరా తీశారు. వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపరుచుకుని వైద్యులు మెరుగైన సేవలందించాలని సూచించారు. పరిశీలన అంశాలను కేంద్ర బృందానికి నివేదిస్తామని, ఆసుపత్రికి మరిన్ని నిధులతో మరింత అభివృద్ధికి సిఫారసు చేస్తామన్నారు. సూపరింటెండెంట్ బాలచంద్ర రెడ్డి, బృంద సభ్యులు కిరణ్, రమేశ్, సురేశ్ ఉన్నారు.


