దేవతలే ముచ్చటపడి భూలోకంలో ఒక శైవ క్షేత్రాన్ని నెలకొల్పిన పవిత్ర స్థలంగా ప్రసిద్ధికెక్కింది ముచ్చట్ల భ్రమరాంబా మల్లికార్జున స్వామివారి ఆలయం. ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాస ఉత్సవాలకు ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబవుతోంది.
ముచ్చట్ల భ్రమరాంబా
మల్లికార్జునస్వామి ఆలయం
బేతంచెర్ల: బోళా శంకరుడిగా పేరు తెచ్చుకుని రాక్షసులకు సైతం అడిగిందే తడువుగా వరాలు ఇస్తున్న పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలని దేవతలు భావించారు. ఫలితంగా ఈ స్థలంలో ముక్కొటి దేవతల సమక్షంలో శివలింగ ప్రతిష్టాపన జరిగింది. ఆ తరువాత రాక్షసులు, దేవతలకు జరిగిన యుద్ధంలో దేవతలు విజయం పొందారని భక్తుల విశ్వాసం. ముక్కోటి దేవతలు ముచ్చటపడి శివలింగం ప్రతిష్టించడంతో, ఈ దేవాలయానికి ముచ్చట్ల మల్లికార్జున స్వామి అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. శివలింగ స్థాపన గురించి మరో కథ కూడా వినిపిస్తుంది. ఇక్కడ శివలింగాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించగా, జనమేజయుడు ఈ దేవాలయ నిర్మాణం చేపట్టినట్లు కథనం. కాగా శ్రీశైల మల్లికార్జునస్వామి అంశే ఈ క్షేత్రంలో స్వయంభు లింగంగా వెలిసిందని మరో కథనం. ఇక్కడ ప్రతి సోమవారం రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రకృతి మధ్యన స్వామి అమ్మవారు కొలువై ఉన్నట్లుగా ఇక్కడి ప్రకృతి రమణీయత ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఎత్తైన గాలిగోపురం శిల్పకళా నైపుణ్యానికి, ఆనాటి కట్టడాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ గాలిగోపురం శ్రీ కృష్ణ దేవరాయులు నిర్మించినట్లు అక్కడ ఉన్న రాతి శాసనాల ద్వారా తెలుస్తోంది.
మాజీ మంత్రి బుగ్గన చొరవతో
ఆలయానికి మహర్దశ
2022 సంవత్సరంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చొరవతో ఆలయానికి రూ.3 కోట్ల నిధులతో బీటీ రోడ్డు వేయడంతో భక్తులకు రహదారి కష్టాలు తప్పడమే కాకుండా సౌకర్యంగా మారింది. గాలిగోపురం పునరుద్ధరణ పనులు, ఆలయంలో గ్రానైట్ రఫ్ ఫ్లోరింగ్, కోనేరు, రథశాల నిర్మాణంతో పాటు రథోత్సవం తేరుకు రూ.1.90 కోట్ల నిధులు 2024లో బుగ్గన చొరవతో మంజూరు కాగా అదే ఏడాది మార్చి 3వ తేదీన భూమి పూజ జరిగింది. తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో కళ్యాణ మండపం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఏ కారణం చేతనో కొంత వరకే పనులు చేపట్టి మధ్యలో నిలిపి వేశారు. సుమారు 8 నెలల క్రితం నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభించలేదు. ఫ్లోరింగ్ పనులు కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడంతో ఆలయ ఆవరణలో నీరు నిలుస్తోంది.
ప్రకృతి సోయగాల మధ్య
ముచ్చట్ల ఆలయం
మాజీ మంత్రి బుగ్గన చొరవతో
ఆలయాభివృద్ధికి నిధుల మంజూరు
కూటమి ప్రభుత్వంలో
ముందుకు సాగని పనులు


