అడిగేవారు లేరని.. | - | Sakshi
Sakshi News home page

అడిగేవారు లేరని..

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

శ్రీశైలంటెంపుల్‌: ఏదేని ప్రభుత్వ శాఖలో ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఒక నెల, రెండునెలలో, మహా అయితే ఆరు నెలలు మాత్రమే. అయితే దేవదాయ శాఖలో మాత్రం ఇన్‌చార్జ్‌ బాధ్యతలు సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీశైల దేవస్థాన ఇంజినీరింగ్‌ విభాగంలో ఇన్‌చార్జ్‌ డీఈఈ హోదాలో అర్హత లేకపోయిన ఓ సహాయ ఇంజినీర్‌ గత మూడు సంవత్సరాలకు పైగా కొనసాగుతూనే ఉన్నా అడిగేవారు లేరు. శ్రీశైల దేవస్థానంలో ఎలక్ట్రికల్‌ డీఈఈ హోదాలో ఎవరు లేకపోవడంతో ఆ విభాగంలో సహాయ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్‌కు 2023 జూన్‌ 13వ తేదీనన డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌గా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తూ అప్పటి శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇది పూర్తి తాత్కాలికమేనని, సీనియార్టీ, బెనిఫిట్స్‌ క్లెయిమ్‌ చేసుకోకూడదని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధం..

శ్రీశైల దేవస్థాన ఎలక్ట్రికల్‌ విభాగంలో హెల్పర్‌గా చేరిన ఓ వ్యక్తి అంచలంచెలుగా ఎలక్ట్రిషియన్‌, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌గా, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని సహాయ ఇంజనీర్‌గా పదోన్నతి పొందినట్లు తెలుస్తుంది. సాధారణంగా సహాయ ఇంజినీర్‌గా పదేళ్ల అనుభవం తరువాత డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌గా పదోన్నతి కల్పిస్తారు. అయితే సదరు ఏఈకి డిప్లొమా, బీటెక్‌ అర్హత లేకపోవడంతో 26 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఏఈ పోస్టులోనే ఉన్నాడు. అయితే దేవస్థానంలో రెగ్యులర్‌ ఏఈలు ఎవరూ లేకపోవడంతో ఆయనకు డీఈఈ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ఫండమెంటల్‌ రూల్స్‌ నెంబర్‌–49ప్రకారం అదనపు బాధ్యతలు సైతం ఆరు నెలలు మాత్రమే అప్పగిస్తారు. ఆరు నెలల అనంతరం ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇన్‌చార్జ్‌ డీఈఈ హోదాలో ఎం–బుక్‌లో సైతం చెక్‌ మెజర్‌మెంట్‌ చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలుస్తుంది. డీఈఈ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తీసుకుని మూడేళ్లుకు పైగా గడుస్తుంది. శ్రీశైల దేవస్థానంలో గత నాలుగు సంవత్సరాలుగా రెగ్యులర్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లు లేకపోయినప్పటికీ కనీసం దేవస్థాన ఉన్నతాధికారులు దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖలు సైతం రాయలేదని సమాచారం.

యూనియన్‌ పేరు చెప్పుకుని తిష్ట..

శ్రీశైల దేవస్థానంలో ఎలక్ట్రికల్‌ విభాగ సహాయ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ దేవస్థాన ఉద్యోగుల సంఘంలో కీలకమైన పోస్టులో ఉండి స్థానికంగానే తిష్ట వేసినట్లు తెలుస్తుంది. యూనియన్‌కు ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని తనకు బదిలీలు లేకుండా శ్రీశైలంలోనే ఏళ్ల తరబడి ఉంటూ పాతుకుపోయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తన రక్తసంబంధీకులకు సైతం ఇంజినీరింగ్‌ విభాగంలో పోస్టు మంజూరు చేయించుకుని, తన విభాగంలోనే పోస్టు ఇప్పించుకున్నట్లు సమాచారం.

పట్టించుకోని దేవదాయశాఖ..

రాష్ట్రంలో రెండవ అతి పెద్ద పుణ్యక్షేత్రంగా ఉన్న శ్రీశైల మహాక్షేత్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా ఇంజినీరింగ్‌ విభాగం కీలకం. అటువంటి విభాగానికి గత నాలుగేళ్లుగా డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్లు లేకపోవడం గమనార్హం. ఎలక్రిక్టకల్‌, సివిల్‌ విభాగాలకు సంబంధించి డీఈఈలు ఎవరు లేరు. ఎలక్రిక్టకల్‌, సివిల్‌ విభాగాలకు ఏఈలే ఇన్‌చార్జ్‌ డీఈఈలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా గత మూడు నెలలుగా ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్లు సైతం లేరు. త్వరలో శ్రీశైల మహాక్షేత్రంలో మూడు విడతలుగా సుమారు రూ.800 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే మాస్టర్‌ ప్లాన్‌ నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన విభాగంలో ముఖ్యమైన అధికారులైన ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లు లేకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

శ్రీశైల దేవస్థాన ఇంజనీరింగ్‌

విభాగంలో ఇష్టారాజ్యం

ఏఈకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌

ఇంజనీర్‌గా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు

మూడేళ్లకు పైగా అదే హోదాలో

కొనసాగింపు

నిబంధనలకు విరుద్ధంగా

ఎం–బుక్‌లో చెక్‌ మెజర్‌మెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement