దొంగ ఓటర్లను అడ్డుకోండి | - | Sakshi
Sakshi News home page

దొంగ ఓటర్లను అడ్డుకోండి

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

విధులు మానేసి.. పచ్చ చొక్కాలు వేసుకోవాలి!

బేతంచెర్ల: నవంబర్‌ 1వ తేదీన జరగబోయే బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓటర్లను అడ్డుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి దూదేకుల దస్తగిరి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బేతంచెర్ల పట్టణంలో సర్‌ ప్రక్రియలో భాగంగా చాలా ఓటర్లను తొలగించారు. అయితే 2026 జనవరి 1వ తేదీ నాటి ఓటరు జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తుండటంతో సర్‌లో తొలగించిన వారి పేర్లతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఓటు వేయించే ప్రయత్నం చేస్తుందని, దీనిపై నిఘా ఉంచాలని లేఖలో సూచించారు. ముఖ్యంగా సర్‌లో చనిపోయిన వారు, వలస వెళ్లిన వారు, ఇల్లు మారిన వారు, గైర్హాజరు ఓటర్లు ఉన్నారని, వీరంతా పాత ఓటర్ల జాబితాలో ఉండటంతో వారి పేరుతో ప్రస్తుతం పల్లెల నుంచి పట్టణంలో ఓటు లేని వ్యక్తులను రప్పించి ఓటు వేయించాలని కుట్రలు చేస్తున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. బేతంచెర్లలో భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, బయటి వ్యక్తులు పోలింగ్‌ కేంద్రాల్లోకి రాకుండా అడ్డుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ బూత్‌ ఏజెంట్లకు తగిన భద్రత కల్పించాలని, ఓటరు గుర్తింపు కార్డులను కచ్చితంగా పరిశీలించాలని ఆయన సూచించారు.

పోలింగ్‌ రోజు వేతనంతో కూడిన సెలవు

నంద్యాల(అర్బన్‌): జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరగబోవు ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లోని దుకాణాలు, సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులకు వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి నవంబర్‌ 1న పోలింగ్‌ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించడమైనదని అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ బషిరున్నీషాబేగం గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు అన్ని దుకాణాలు, సంస్థల యజమానులు సహకరించాలని కోరారు.

● పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి

చిప్పగిరి: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే పోలీసులు విధులు మానేసి పచ్చ చొక్కాలు వేసుకొని తిరగాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేశారన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం నామినేషన్ల ఘట్టం ముగిసి పోవడంతో అభ్యర్థులు ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించకుండా పోలీసులు అనేక రకాలుగా అడ్డుకుంటున్నారన్నారు. చిప్పగిరి మండలం నగరడోణలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్లలోకి వెళ్లి చిప్పగిరి ఎస్‌ఐ భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెడతామని భయపెడుతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో అమలవుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో పోలీసులు పావులుగా మారడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై అన్యాయంగా కేసులు నమోదుచేసే సయమంలో పోలీసులు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో గెలిచి తీరుతామన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎవరూ భయపడవద్దని, ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు. ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదని పోలీసులు గుర్తించుకోవాలన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement