ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం వేకువజామునే మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య పవిత్ర హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. రాత్రి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులకు గ్రామోత్సతం నిర్వహించారు.
అనాథ బాలికకు
కలెక్టర్ ఆర్థిక సాయం
నంద్యాల(న్యూటౌన్): అనాథ బాలిక గురులక్ష్మీ ప్రసన్న విద్యాభ్యాసానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆర్థిక సాయం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ప్రసన్నకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కళాశాల ఫీజుకు సంబంధించిన చెక్కును అందజేశారు. చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామానికి చెందినగురులక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులందరూ మట్టిమిద్దె కూలిన ఘటనలో మృతి చెందారు. అప్పట్లో విద్యార్థిని ఉన్నత విద్యాభ్యాస బాధ్యతను స్వీకరించిన కలెక్టర్, ఇప్పటికే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫీజును చెల్లించారు. తాజాగా ద్వితీయ సంవత్సరం ఫీజును కూడా అందజేశారు. ప్రథమ సంవత్సరంలో మంచి మార్కులు సాధించిన ప్రసన్నను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పరిశీలన
నంద్యాల(అర్బన్): స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలనుకునే ఉద్యోగులు.. డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును సమర్పించాలన్నారు. అనంతరం నిర్దేశిత ప్రక్రియను అనుసరించి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాన్ని నిర్దేశించిన చిన్న కవరులో ఉంచి, ధ్రువీకరించిన ఫారాన్ని బయట ఉంచి, ఈ రెండింటినీ పెద్ద కవరులో పెట్టి సమర్పించాలన్నారు. నిబంధనల ప్రకారం కవర్లను సక్రమంగా సమర్పించినప్పుడే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపునకు పరిగణనలోకి వస్తాయన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద
భద్రత కట్టుదిట్టం
బొమ్మలసత్రం: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నంద్యాల పట్టణంలోని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతను నియమించామని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఓటర్లు ఎటువంటి భయం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్‌బాషా, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలు మల్లిఖార్జున గుప్తా, రామాంజనేయులు, ఇస్మాయిల్, సుధాకర్‌రెడ్డి, ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు.


