టీడీపీ నేత కవ్వింపు చర్యలు
బొమ్మలసత్రం:మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు యత్నిస్తున్నారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున మంగళవారం స్థానిక 13వ వార్డులో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ అభ్యర్థి దాదాపు 50 మంది గూండాలతో కలసి రోడ్డుపై కూర్చోని హంగామ సృష్టించాడు. ఈ వార్డులో టీడీపీ అభ్యర్థి కండే శ్యామ్ సుందర్‌లాల్, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈ వార్డు ఓటర్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో టీడీపీ అభ్యర్థి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో తన ఉనికిని చాటుకోవాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా కార్యక్రమాన్ని అడ్డుకోవాలని దాదాపు 50 మంది టీడీపీ గూండాలను వార్డుకు పిలించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషాలు అభ్యర్థ్ధితో పాటు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ నేతలు రోడ్డుపై అడ్డంగా కూర్చున్నారు. తన ఫ్లెక్సీపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు స్టిక్కర్ అతికించారని, దానికి మాజీ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని టీడీపీ అభ్యర్థి శ్యామ్ సుందర్‌లాల్ కేకలు వేశాడు. అయితే అక్కడున్న వైఎస్సార్‌సీపీ నాయకులు శ్యామ్‌సుందర్ కావాలనే ప్రచారాన్ని అడ్డుకునేందుకు డ్రామాలు చేస్తున్నాడని వారించారు. వైఎస్సార్‌సీపీ ప్రచారం వైపు దూసుకెళ్తుండగా వన్‌టౌన్ సీఐ ఇస్మాయిల్ తన సిబ్బందితో అడ్డుపడ్డారు. అయినప్పటికీ టీడీపీ గూండాలు పోలీసులను తోసుకుంటూ మాజీ ఎమ్మెల్యే వైపు దూసుకెళ్లి దాడికి యత్నించారు. అక్కడున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వారిని లెక్కచేయకుండా పక్కకు తోస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


