కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాపై అర్నబ్ తుపాను ప్రభావం చూపే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో అర్నబ్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. తుపాను ప్రభావంతో వర్షాలు కురిస్తే రబీలో ప్రధానపంట శనగ సాగుకు అవకాశం ఉంటుందనే ఆశాభావంతో రైతులు ఉన్నారు. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 109.9 మిమీ ఉండగా.. 27 రోజుల్లో 18.5 మి.మీ మాత్రమే నమోదైంది. రబీ సాధారణ సాగు 1,07,475 హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 656 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి.
తుపాను నేపథ్యంలో అప్రమత్తం
కర్నూలు(సెంట్రల్): అర్నబ్ తుపాను నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణ సహాయానికి 08518–277305ను సంప్రదించాలన్నారు.
సంగ్రామానికి సన్నాహాలు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని 484 గ్రామ పంచాయతీలు, 5,100 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు స్థానిక జిల్లాపరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో భద్రపరచిన ఎన్నికల సామగ్రిని మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్, డీఎల్‌పీఓ టి.లక్ష్మి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రినంతటినీ మండలాల వారీగా విభజించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ మాట్లాడుతూ సిద్ధంచేసిన సామగ్రిని రెండు మూ డు రోజుల్లో సంబంధిత ఎంపీడీఓల ద్వారా మండలాలకు చేర్చే ప్రక్రియను చేపడతామన్నారు.


