ఎన్నికల్లో సమష్టిగా పనిచేయాలి
రాష్ట్రంలో వానలు లేక పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర ధరలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారు. వీరిని ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కారు ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ప్రశ్నించే వారిపై దాడులు, దౌర్జన్యాలతో చంద్రబాబు దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారు.
– పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల మాజీ ఎంపీ
నంద్యాల(అర్బన్): రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామ సమీపంలోని ఎస్‌ఆర్ కన్వేన్షన్‌లో ఆదివారం కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరైన ఈ సమావేశంలో మొదట దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు, 12 నుంచి 22 వ తేదీ వరకు మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటికీ వెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రజలకు వివరించడంతో పాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన మంచిని తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన బుక్‌లెట్‌లను సైతం ప్రతి ఇంట్లో అందజేయాలని సూచించారు. అలాగే స్థానికంగా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలే వైఎస్సార్‌సీపీ బలమని చెప్పారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపునకు సైనికుల్లా పనిచేయాలన్నారు. కూటమి పాలనలో మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మారిందని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి అర్హులకు అన్యాయం చేశారన్నారు. డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయన్నది జగమెరిగిన సత్యమని, అందుకే సీబీఐ విచారణకు కూటమి సర్కారు భయపడుతుందన్నారు.
వెన్నుపోటు పాలన
రెండున్నరేళ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మహిళలు, నిరుద్యోగులు, రైతులను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు మహిళలకు మాయమాటలు చెప్పారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ దోచుకోవడం.. దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. 2025లో నిర్వహించింది మెగా డీఎస్సీ అంటూ లోకేష్ గొప్పలు చెప్పుకుంటున్నారని, అది మెగా కాదు.. దగా డీఎస్సీ అని వైఎస్సార్‌సీపీ నిరూపించిందన్నారు. యువగళంలో ఉన్న వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు డీఎస్సీ నిర్వహించారని విమర్శించారు. దమ్ముంటే అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని లేకపోతే లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులకు పార్టీ గుర్తింపు కార్డులను కాటసాని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పీపీనాగిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ నాయకులు బుడ్డా శేషారెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు శశికళారెడ్డి, సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. అయినా, ఏదో గొప్పగా చేశానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవమేమిటో ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం సమష్ఠిగా పనిచేయాలి.
– ఇసాక్‌బాషా, ఎమ్మెల్సీ
ఈ నెల 23 నుంచి గ్రామ,
వార్డు స్థాయిలో ఇంటింటి ప్రచారం
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను
ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రజా సమస్యలపై
నిరంతర పోరాటం సాగించాలి
ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా
ఎగురవేయాలి
వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పార్టీ జిల్లా
అధ్యక్షుడు కాటసాని పిలుపు


