గోస్పాడు: వరుణుడు కరుణించలేదు.. పాలకులు కనికరం చూపలేదు.. చివరకు ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి ఎల్‌నినో భయం వెంటాడుతున్నా దేవుడిపై భారం వేసి సేద్యం పనులు చేపట్టారు. బోర్లు, బావుల కింద మొదట్లో సాగు ఊపందుకుంది. ఎలాగైనా వానలు కురుస్తాయి.. ప్రాజెక్ట్‌లు నిండుతాయనే భావనంతో విత్తనాలు వేశారు. అడపాదడపా వానలతో పంటలు మొలకెత్తినా తర్వాత వరుణుడు మొహం చాటేశాడు. రైతులకు నీటి సమస్య తీవ్రమైంది. పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నం చేసినా చివరకు దక్కించుకోలేకపోతున్నారు. ఇక చేసేదేమి లేక పంటలను కొందరు జీవాలు, పశువులకు మేతగా వదిలేశారు. మరికొందరు పంటను దున్నేసి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 2.20 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా 1.30 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగయింది. పూర్తిగా నమోదు కావాల్సిన పంటల సాగు ఇప్పటికీ కూడా సగభాగమే నమోదు అయిందంటే అందుకు వర్షాలు లేక పోవడమే కారణం. అయితే కృష్ణానది ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసి శ్రీశైలానికి భారీగా వరద నీరు చేరింది. ఈ క్రమంలో వెలుగోడు, గోరుకల్లు రిజర్వాయర్లను నింపారు. అయితే అధికారులు మాత్రం పంటల సాగుకు నీరు విడుదల చేయడం లేదు. తాగునీరు అవసరాల పేరుతో కుంటలు, నీటి ట్యాంకులు నింపేందుకు మాత్రమే అంటూ కేసీకి నీటిని విడుదల చేశారు. కనీసం పంటకు ఒక తడి నీరు పెడితే పంట చేతికందుతుందని రైతులు కోరుతున్నారు.
పంటలను కాపాడుకోలేక..
జిల్లాలో అధికంగా సాగుచేసే పైర్లలో వరి ప్రధానమైనది. అయితే ఈ ఏడాది 70 వేల హెక్లార్ల సాధారణ విస్తీర్ణంలో ఇప్పటి వరకు 16 వేల హెక్టార్లు మాత్రమే సాగు అయినట్లు అధికారులు చెబుతున్నారు. మెక్కజొన్న, కంది, మినుము వంటి పైర్లు అంతంతమాత్రంగానే సాగు కాగా వేసిన పైర్లకు సాగునీరు అందక పైర్లు పెరుగుదల నిలిచిపోయి గిడిసబారి వాడిపోతున్నాయి. ఇక చేసేదేమి లేక పంటలను వదిలేసే వారు కొందరైతే.. మరికొందరు ఉన్నవాటిని కూడా దున్నేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వచ్చినంత దుర్భర పరిస్థితి ఎన్నడూ రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి చివరకు పైర్లను కాపాడుకోలేకపోయారు. మినుము పైరులో రెండు బస్తాలలోపు దిగుబడులే వస్తుండగా వాటిలో కూడా నాణ్యమైన ధాన్యం ఉండటం లేదు.
శ్రీశైలానికి వరదొచ్చినా
సాగునీరు లేదాయె
ఆరుతడి పంటలు సాగు చేసి
నష్టపోయిన రైతులు
బోర్లు, బావులు అడుగంటడంతో
ఎండిన పంటలు


