● భైరవాణిలో మట్టి తరలింపునకు
అడ్డుకున్న ప్రజలు
మహానంది: భైరవాణి చెరువులో మట్టి తరలింపును గోపవరం గ్రామస్తులు శనివారం రాత్రి అడ్డుకున్నారు. గ్రామ సమీపంలోని భైరవాణి చెరువులో రైతుల అవసరాల పేరుతో ఆగస్టు 28న 10,300 క్యూబిక్ మీటర్ల మేరకు పూడికతీతకు టీడీపీ నాయకులు అనుమతులు తీసుకున్నారు. రెండు రోజులు గ్రామ పరిధిలో రైతులకు మాత్రమే తరలిస్తున్నామని నమ్మించారు. నంద్యాల మండలం పొన్నాపురం, అయ్యలూరిమెట్ట, పెద్దకొట్టాల గ్రామాలతో పాటు సమీప గ్రామాల్లో ఉన్న ఇటుకల బట్టీలకు మట్టిని తరలించి సుమారు రూ. 14లక్షలు సంపాదించారని సోషల్ మీడియాల్లో వైరల్ కావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఆరు టిప్పర్లను, జేసీబీని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. తరలిస్తున్న మట్టిని చెరువులోనే వేయించి టిప్పర్లను వెనక్కి పంపించారు. అనుమతులు ఉంటే అర్థరాత్రి వేళ ఎందుకు తరలిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. అనుమతులకు విరుద్ధంగా మట్టి తరలింపునకు అడ్డుకట్ట వేయకపోతే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.


