నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

Sep 11 2026 11:21 AM | Updated on Sep 11 2026 11:21 AM

నంద్యాల(న్యూటౌన్‌): స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఈనెల 7వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్నారు.

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు క్యూకంపార్ట్‌మెంట్లలో పాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి.

పోతిరెడ్డిపాడు నుంచి కొనసాగుతున్న నీటివిడుదల

జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంటి నీటివిడుదల కొనసాగిస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం డ్యాంలో ఉదయం 868.80 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు వద్ద 867.80 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 4, 6 గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి సరఫరా చేసినట్లు వెల్లడించారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి గాలేరినగరి సుజల స్రవంతి కాల్వకు 7వేల క్యూసెక్కులు, కేసీ ఎస్కేప్‌ కాల్వకు వెయ్యి క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు.

సర్క్యూట్‌ బెంచ్‌ వద్దు..

శాశ్వత హైకోర్టు బెంచ్‌ కావాలి

కర్నూలు: ‘సర్క్యూట్‌ బెంచ్‌ వద్దు.. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ కావాలి’ అంటూ నినాదాలతో న్యాయవాదులు హోరెత్తించారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 14వ రోజు ఆదివారం కొనసాగాయి. శాశ్వత హైకోర్టు బెంచ్‌ కర్నూలులో ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమ ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని న్యాయవాదులు ప్లకార్డులను ప్రదర్శించారు. హైకోర్టు బెంచ్‌ కోసం కొంతకాలంగా వివిధ రూపాల్లో న్యాయవాదులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేవరకు అన్ని పక్షాల రాజకీయ నేతలు, ప్రజాసంఘాల సహకారంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రుడు స్పష్టం చేశారు. న్యాయవాదుల దీక్షలో సాద్విక, నిస్సీ, జి.మురళీకృష్ణ, ఎస్‌.మహమ్మద్‌ అన్వర్‌ సాదత్‌, గోపాల్‌ యాదవ్‌, ఈదుల బాలాజీ రెడ్డితో పాటు న్యాయ విద్యార్థి హేమంతేశ్వర మునిరాజు పాల్గొన్నారు. న్యాయవాదులు పెద్ద ఎత్తున తమ విధులు బహిష్కరించి దీక్షా శిబిరాన్ని సందర్శించి రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న వారికి పూలమాలలు వేసి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడు రసూల్‌ ఖాన్‌ తదితరులు దీక్ష చేస్తున్న న్యాయవాదులకు మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement