శ్రీశైలంటెంపుల్: రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాలను సందర్శించే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైల ఆలయానికి చివరిస్థానం లభించింది. ప్రతి నెలా వాట్సప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా?, ఆలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా?, ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా?, పారిశుద్ద్యం సంతృప్తికరంగా ఉందా? అనే అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. గత 4వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు జరిపిన సర్వే వివరాలను సోమవారం వెల్లడించారు. ఈ సర్వేలో మొదటి ర్యాంక్ విజయవాడ, రెండో ర్యాంక్ ద్వారక తిరుమల, మూడో ర్యాంక్ శ్రీకాళహస్తి, నాల్గో ర్యాంక్ అన్నవరం, ఐదో ర్యాంక్ కాణిపాకం, ఆరో ర్యాంక్ సింహాచలం, చిట్టచివరి ఏడో ర్యాంక్ శ్రీశైల దేవస్థానానికి దక్కింది. గత ఆగస్టు నెలలో 67శాతం సంతృప్తి చెందితే సెప్టెంబరు నెలకు వచ్చేసరికి 65.5శాతానికి పడిపోయింది.
అక్టోబర్ 11 నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేది వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మహోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ప్రాథమిక సమావేశాన్ని బుధవారం దేవస్థానం పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విభాగాలు ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలన్నారు. ఉత్సవాల సందర్భంగా తగిన విద్యుద్దీపాలంకరణ, సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ, పోలీసు శాఖ సమన్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలని ఈఓ ఆదేశించారు.
ఎస్సార్బీసీకి నేడు
నీటి విడుదల బంద్
పాణ్యం: ఎస్సార్బీసీ ప్రధానకాల్వకు గురువారం నీటి విడుదల బంద్ చేస్తున్నట్లు నిలిపివేస్తున్నట్లు ఈఈ రాఘురామిరెడ్డి బుధవారం విలేకరులకు తెలిపారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ నుంచి అవుకు జలాశయానికి తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని తరలించినట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం నుంచి కాల్వకు గేట్లు మూసివేస్తామన్నారు. తదుపరి ఆదేశాల వచ్చేంత వరకు ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయబోమన్నారు.
చనుగొండ్ల కొండల్లో చిరుత పులుల జంట
డోన్ టౌన్: మండలంలోని చనుగొండ్ల గ్రామ సమీప కొండల్లో జంట చిరుత పులల సంచారం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుత పులులను బంధించి సంరక్షణ కేంద్రాలకు తరలించాలని కోరుతున్నారు.
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.30 కోట్లు
మంత్రాలయం: హుండీల్లోని కానుకలతో శ్రీరాఘవేంద్రస్వామి మఠానికి 16 రోజులకు గాను రూ 3.30 కోట్లు సమకూరింది. బుధవారం శ్రీమఠం రాజ్యాంగణ భవనంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 8 వరకు సంబంధించి 16 రోజుల హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. అందులో నగదు రూపేణా రూ 3,20,66,639, నాణేలా రూపంలో రూ.10,02,500, అలాగే 47 గ్రాముల బంగారం, 632 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్‌కోనాపూర్, అనంతపురాణిక్ పాల్గొన్నారు.


