హొళగుంద: మండల కేంద్రంలోని ఈబీసీ, సినిమా రోడ్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని బుధవారం సాయంత్రం డీఎస్‌ఓ (డిస్ట్రిక్ సివిల్ సప్‌లై ఆఫీసర్) రాజారఘువీర్ దాడులు చేసి పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు నుంచి వచ్చిన ఆయన సీఎస్‌డీటీ దీప, తహసీల్దార్ లక్ష్మిరాజు, ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌తో కలిసి దాడులు చేపట్టారు. ఈబీసీ కాలనిలోని ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 15 బస్తాల (6.25 క్వీంటాళ్లు) రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అలాగే సినిమా రోడ్డులోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 77 క్వింటాళ్లు (189 బస్తాలు) బియ్యాన్ని దాడులు చేసి పట్టుకోగా ఆ ఇంటి వారితో పాటు స్థానికులు డీఎస్‌ఓ, ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగారు. అవి రేషన్ బియ్యం కాదని, రైతులు పండించిన బియ్యమని వాదించారు. అయితే బియ్యం నిల్వలో పీడీఎస్ బియ్యం కలిసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వాటిని టెస్టింగ్ కోసం కర్నూలు ల్యాబ్‌కు పంపుతున్నట్లు తహసీల్దార్ లక్ష్మిరాజు తెలిపారు. రేషన్ బియ్యం కలిసి ఉంటే బాధ్యులపై కేసులు నమోదు చేసి బియ్యం బస్తాలను సీజ్ చేస్తామన్నారు. టెస్టింగ్ రిపోర్ట్ గురువారం సాయంత్రం వస్తుందని ఆయన వెల్లడించారు. మొత్తం బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంచారు. డీటీ నిజాముద్దీన్ తదితరులు వెంట ఉన్నారు.


