నంద్యాల: జిల్లాలో కరువు అలుముకుని రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కూటమి నేతలకు కనిపించడం లేదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. పట్టణంలోని శిల్పా స్వగృహంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులతో శిల్పా రవి సమావేశం నిర్వహించారు. తాగు, సాగు నీరు అందక ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, వ్యవసాయానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం డ్యాంలో నీరున్నా రిజర్వాయర్లు, చెరువులు ఎందుకు నింపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందంతోనే శ్రీశైలం డ్యాంలో ఉన్న నీటిని తెలంగాణకు వదులుతున్నారన్నారు. ప్రజలు సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. సాగునీరు అందించడంలో, పండించిన పంటకు సరైన ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుల హక్కులను కాపాడుకోవడానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అన్నదాతలకు అండగా నిలబడేందుకు రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టి అధికారులు, ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సాగునీటి సాధన కోసం వచ్చే నెల 1వ తేదీన వెలుగోడు రిజర్వాయర్ వద్ద రైతులతో కలసి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడుతున్నామని, ఈ నిరసన కార్యక్రమానికి రైతులు, రైతు సంఘం నేతలు, పార్టీ నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. రాయలసీమ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. సమావేశంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, నంది రైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, రైతు సంఘం నాయకులు అరికట్ల శివరామకృష్ణారెడ్డి, శివారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, నంద్యాల నియోజకవర్గానికి చెందిన పలువురు రైతు నాయకులు, వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీశైలంలో నీరున్నా
రిజర్వాయర్లు ఎందుకు నింపరు?
1న వీబీఆర్ ముట్టడికి తరలిరండి
నంద్యాల మాజీ ఎమ్మెల్యే
శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి


