ఆశలు ఎండిపోయి..
వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలను చివరకు జీవాలకు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలో ఈ ఏడాది 38 వేల హెక్టార్లలో పత్తి, కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. 20 వేల హెక్టార్లలో అత్యధికంగా పత్తి సాగు చేశారు. ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి పెట్టి రైతులు పత్తి పంట సాగు చేశారు. ఎకరాకు రూ. 10 వేలు ఖర్చు చేసి కంది పంట సాగు చేశారు. రైతులు సాగు చేసిన పంటలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపింది. రెండు నెలలుగా వర్షాలు రాకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. – ఆలూరు రూరల్
కురుకుంద గ్రామంలో పత్తిపంటను గొర్రెలను వదిలేసిన దృశ్యం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం చౌడేశ్వరిదేవికి కుంకుమార్చన అభిషేకం తదితర పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి అభిషేకం, మహిళలతో సామూహిక కుంకుమార్చన పూజలు చేపట్టారు. పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పాలక మండలి చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు.
శ్రీమఠంలో..
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక పీఠం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పవిత్ర వరలక్ష్మీ పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో పూజలు చేపట్టారు. పూజా మందిరంలో లక్ష్మి పూజ, మూల, జయ, దిగ్విజయ రాముల పూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ పూజలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే గ్రామ దేవత మంచాలమ్మకు విశేషాలంకరణ చేపట్టి ప్రత్యేక పూజలు కానిచ్చారు.


