● పుట్లూరులో రూ. 5 కోట్లతో కోవెల నిర్మాణం
కృష్ణగిరి: రాజుల కాలంలో నిర్మించిన దేవాలయాల్లో శిల్పాలు మహా అద్భుతంగా కనిపిస్తాయి. వాటిని పోలిన విధంగా మండలంలోని పుట్లూరు గ్రామంలో మారెమ్మ అమ్మవారికి నూతన దేవాలయాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు పూనుకున్నారు. రెండేళ్లుగా దాదాపు రూ.5 కోట్లతో ఆలయాన్ని అతి సుందరంగా నిర్మిస్తున్నారు. అమ్మవారికి వచ్చిన కానుకలతోపాటు, గ్రామస్తుల చందాలు, దాతల సహాయంతో వేగంగా పనులు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఏటా భాద్రపద శుక్ల చతుర్ధశి మొదలు బహుళ చవితి వరకూ అమ్మవారికి బ్రహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలను తిలకించేందుకు రాయలసీమ జిల్లాతోపాటు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. దేవాలయాన్ని మరో 6 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తిరుపతి నుంచి రాయిని తీసుకొచ్చి అక్కడే శిల్పులు సుందరంగా చెక్కి నిర్మిస్తున్నారని చెప్పారు.


