శ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీశైల దేవస్థానం శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో 1,500 మంది ముత్తైదువులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. శ్రావణ మూడవ శుక్రవారం ప్రత్యేకంగా శివసేవకులకు, నాల్గవ శుక్రవారం 750 మంది చెంచు ముత్తైదువులకు, 750 మంది సాధారణ ముత్తైదువులకు సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. వ్రతాన్ని జరిపించుకునే ముత్తైదువులకు అమ్మ వారి శేషవస్త్రంగా చీర, రవిక వస్త్రం, పూలు, గాజులు, లడ్డూప్రసాదం, శ్రీశైలప్రభ, తులసి, ఉసిరి మొదలైన దేవతావృక్షాలను, కై లాస కంకణాలను అందజేస్తామని అన్నారు. సనాతన ధర్మంపై అవగాహన కల్పించి, ధార్మిక చింతనను పెంపొందించుటకు వ్రతాలు నిర్వహిస్తున్నామన్నారు.
వీబీఆర్‌కు నిలిచిన ఇన్‌ఫ్లో
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్)కు కృష్ణా జలాల ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. గురువారం ఉదయం 6 గంటల సమయానికి 4.624 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి ఎలాంటి నీటి ప్రవాహం లేదని తెలుగు గంగ అధికారులు తెలిపారు. టీజీపీ లింక్ కాలువ నుంచి కూడా ఇన్‌ఫ్లో నమోదు కాలేదు. రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం సగటున 250 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో ఉంది. ఇందులో వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాలకు తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. 1ఎల్, 1ఆర్, టీజీపీ ప్రధాన కాలువలకు ప్రస్తుతం నీటి విడుదల లేదు. స్పిల్‌వే ద్వారా కూడా నీటి ప్రవాహం నమోదు కాలేదు.
లోకో ఫైలెట్ సమయస్ఫూర్తి
● ప్రాణాలతో బయటపడిన వృద్ధురాలు
డోన్ రూరల్: డెమో రైలు లోకో ఫైలెట్ సమయస్ఫూర్తితో ఓ వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. గురువారం సాయంత్రం డోన్ నుంచి కర్నూలుకు గుంతకల్ డెమో రైలు బయలుదేరింది. అయితే స్థానిక రాముల దేవాలయం సమీపంలో రైలు పట్టాలపై మతిస్థిమితం లేని మహిళ (70) పడుకుని ఉండటంతో లోకో ఫైలెట్ దూరం నుంచి గమనించి రైలు నిలిపివేశాడు. స్థానికుల సహాయంతో ఆమెను అక్కడి నుంచి దూరంగా పంపించేశారు. తన వివరాలను కూడా ఆమె సక్రమంగా చెప్పలేని స్థితిలో ఉంది. వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన డెమో లోకో ఫైలెట్‌ను పలువురు అభినందించారు.
స్వల్ప కాలిక పంటలు
సాగు చేసుకోవాలి
నంద్యాల(అర్బన్): వరి, మిర్చి పంటలకు ప్రత్యామ్నాయంగా స్వల్ప కాలిక పంటలైన ఉలువలు, మినుములు, కొర్ర వంటి పంటలు సాగు చేసుకోవాలని ఆర్‌ఏఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఏడీఆర్ కవిత, డీడీఏ గంగాధర్‌రావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో గురువారం శిక్షణ, సందర్శన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం కర్నూలు, నంద్యాల జిల్లాలో సాగు అవుతున్న పంటలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపడితే రైతులు లాభాలను గడించవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ ఖాద్రి, పీరానాయక్, తదితరులు పాల్గొన్నారు.
క్వింటా ఉల్లి రూ.3,749
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి ధర జోరుమీద ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉల్లిగడ్డలు కేవలం రెండు లాట్లు మాత్రమే వచ్చాయి. నాణ్యత ఒక మోస్తరుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఒక లాట్‌కు రూ.3,569, మరో లాట్‌కు రూ.3,749 ధర లభించడం విశేషం.


