ఎస్సార్‌బీసీకి నీటిని విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సార్‌బీసీకి నీటిని విడుదల చేయాలి

Aug 21 2026 7:51 AM | Updated on Aug 21 2026 7:51 AM

బనగానపల్లె రూరల్‌: అవుకు రిజర్వాయర్‌కు జీఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా కాకుండా ఎస్సార్‌బీసీ ద్వారా నీటిని విడుదల చేయాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన స్వగృహంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో కాటసాని మాట్లాడుతూ.. గోరుకల్లు నుంచి ఎస్సార్‌బీసీ కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్‌కు నీటి విడుదల చేస్తే చిన్నచిన్న చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉంటాయన్నారు. అలాగే పాణ్యం, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ వరద కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్‌ను నీటితో నింపడంతో ఈ ప్రాంత రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. అవుకు రిజర్వాయర్‌ను నింపి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సిమెంట్‌ పరిశ్రమలకు విక్రయించేందుకే అని విమర్శించారు. హంద్రీనీవా, మల్యాల కాల్వలకు నీరు విడుదల చేస్తున్న అధికారులు ఎస్సార్‌బీసీ ప్రధాన కాల్వకు అడ్డుకోవడం దారుణమన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ 35,315 క్యూసెక్కులు, ఏపీ 18,792 క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారే కానీ.. రైతులకు సాగునీరు అందించలేకపోతున్నారన్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలు,

మంత్రులు ఎందుకు స్పందించరు?

ఎస్సార్‌బీసీకి నీటి విడుదలపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు మాట్లాడడం లేద ని మాజీ ఎమ్మెల్యే కాటసాని ప్రశ్నించారు. ఈ ప్రాంత రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నా వారి లో చలనం కలగడం లేదన్నారు. రెండేళ్లుగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారన్నారు. ఒక్కొక్క ఎరువు బస్తాపై సుమారు రూ.1,500 వరకు ధర పెంచడం రైతులపై భారం మోపడమేనన్నారు. ధరలను నియంత్రించి, రైతులకు కావాల్సిన ఎరువులను యాప్‌ ద్వారా కాకుండా పాత విధానంలోనే పంపిణీ చేయాలని కాటసాని కోరారు.

రైతుల పక్షాన పోరాటం..

గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి అవుకు రిజర్వాయర్‌కు ఎస్సార్‌బీసీ ప్రధాన కాల్వ ద్వారా నీరు విడుదల చేయకుంటే రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. గోరుకల్లు, అవుకు రిజర్వాయర్ల నీటిని రైతుల అవసరాలకు మాత్రమే వినియోగించాలన్నారు. సిమెంట్‌ పరిశ్రమలకు విక్రయించి లబ్ధిపొందాలనుకోవడం మంచిదికాదన్నారు. ఈ నీటిని దుర్వినియోగం చేస్తే రైతులతో కలిసి అవుకు రిజర్వాయర్‌ ముట్టడి కార్యక్రమం కూడా చేసేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో అవుకు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ కాటసాని తిరుపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, గడ్డం బాషా తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమలకు మళ్లించేందుకే

జీఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా తరలింపు

ప్రభుత్వం స్పందించకపోతే అవుకు

ప్రాజెక్టును ముట్టడిస్తాం

మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement