సీఎం చీకటి ఒప్పందంతోనే నీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

సీఎం చీకటి ఒప్పందంతోనే నీటి కష్టాలు

Aug 21 2026 7:51 AM | Updated on Aug 21 2026 7:51 AM

కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి

శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసి

రైతులను ఆదుకోవాలి

మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎంతో చేసుకున్న చీకటి ఒప్పందం వల్లే రాయలసీమకు నీటి కష్టాలు ఎదురవుతున్నాయని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. గురువారం శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల రైతులతో కలిసి నంద్యాల పట్టణం పద్మావతినగర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శిల్పా సమీక్ష నిర్వహించారు. తాగు, సాగునీరు అందించేందుకు చేపట్టిన కార్యాచరణ ప్రణాళికపై రైతుల సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 857 అడుగుల మేర నీటి నిల్వలు ఉండి, 110 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండుగా ఉన్నప్పటికీ దిగువకు నీరు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి, పశువుల తాగునీటి అవసరాలు తీర్చడానికై నా ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ఎడమ గట్టు నుంచి రోజుకు 4 టీఎంసీల నీటిని తరలిస్తున్నా ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ను దిగువ రిజర్వాయర్లకు వెంటనే నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమకు నీటి సమస్య పొంచి ఉందని, ఈ పరిస్థితిలోనైనా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై వెంటనే దృష్టి సారించాలన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కృషి వల్లే సాధ్యమైందన్నారు. తండ్రి బాటలోనే నడిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి ఎంతో కృషి చేశారన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తక్షణమే తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, భాస్కరరెడ్డి, సుజాతమ్మ, మహేశ్వరరెడ్డి, వెంకటరామిరెడ్డి, వెంకటరమణ, సంజీవరెడ్డి, రఘురామిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం రైతు నాయకులు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement