బైక్‌పై నుంచి పడి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి పడి మహిళ మృతి

Aug 18 2026 12:57 AM | Updated on Aug 18 2026 12:57 AM

నందికొట్కూరు: నేషనల్‌ హైవే – 340సీ లో బైక్‌పై వెళ్తూ పట్టణ సమీపంలోని డిగ్రీ కళాశాల వద్ద ప్రమాదవశాత్తు కింద పడి కృష్ణవేణి (39) అనే మహిళ మృతి చెందింది. ఘటనపై హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.చెన్నయ్య తెలిపిన వివరాలు.. కృష్టవేణి దంపతులు నందికొట్కూరు పట్టణంలోని ట్యాంకు ఏరియాలో నివాసం ఉంటున్నారు. మండల పరిధిలోని కోళ్లబావాపురం గ్రామానికి పని నిమిత్తం వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కృష్ణవేణి ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స చేస్తుండగానే ఆమె మృతి చెందింది. తల్లి మానవపాటి రాములమ్మ ఫిర్యాదు మేరకు భర్త శివమల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని హెడ్‌ కానిస్టేబుల్‌ చెప్పారు.

వివాహిత బలవన్మరణం

నందికొట్కూరు: పట్టణంలోని వాల్మీకి నగర్‌కు చెందిన బోయ శివకుమార్‌ భార్య రమాదేవి (ప్రియ) (20) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మృతి చెందింది. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్‌ మండలం కొన్నేరు గ్రామానికి చెందిన రమాదేవికి నందికొట్కూరుకు చెందిన శివకుమార్‌తో రెండున్నరేళ్ల క్రితం వివాహం అయ్యింది. దంపతల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని టౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. మృతురాలికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నారు.ఇదిలాఉండగా తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, చంపేశారనే అనుమానాలు ఉన్నాయని మృతురాలి తండ్రి నాగరాజు బోరున విలపించారు.

చర్చి ఫాదర్‌ దుర్మరణం

ప్రార్థనలు చేసేందుకు బైక్‌పై వెళ్తుండగా

ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ప్రమాదం

జూపాడుబంగ్లా: బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొనటంతో చర్చి ఫాదర్‌ మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలుకు చెందిన దాసరి శేషు(55) భాస్కరాపురం గ్రామంలోని ఏబీఎం చర్చి ఫాదర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం చర్చిలో ప్రార్థనలు నిర్వహించేందుకు ఫాదర్‌, అతని భార్య జ్యోతి భాస్కరాపురం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని మసీదు సందులోంచి చర్చి వద్దకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన శివచెన్నయ్య కుమారుడు శివాజీ నంబర్‌ లేని స్వరాజ్‌ ట్రాక్టర్‌ను అతివేగంగా నడుపుతూ ఎదురుగా వచ్చిన ఫాదర్‌ బైక్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంతో కింద పడిపోయిన ఫాదర్‌ దాసరి శేషుకు తల, ముక్కు, కాలికి తీవ్రగాయాలు కాగా అతని భార్య జ్యోతికి కుడి కాలికు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మధ్యాహ్నం చర్చి ఫాదర్‌ దాసరి శేషు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement